రాజకీయ వ్యవహారాల ఉపకమిటీలో ఉత్తమ్‌కు చోటు 

12 Feb, 2023 02:23 IST|Sakshi

ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ప్లీనరీకి పలు కమిటీల ఏర్పాటు 

ముసాయిదా కమిటీలో రఘువీరారెడ్డి, కొప్పుల రాజుకు అవకాశం 

ఈ నెల 24 నుంచి 3 రోజులపాటు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 85వ ప్లీనరీ 

సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) 85 వప్లీనరీ సమావేశాలకు ముసాయిదా కమిటీతోపాటు వివిధ అంశాల్లో ఉపకమిటీలను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్‌గా వీరప్పమొయిలీ, కన్వీనర్‌గా అశోక్‌ చవాన్‌తోపాటు 20 మంది సభ్యులు ఉన్నారు.

ఈ కమిటీలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితోపాటు మాణిక్యం ఠాగూర్‌కు చోటుకల్పించారు. ముసాయిదా కమిటీ చైర్మన్‌గా జైరాం రమేశ్, కన్వీనర్‌గా పవన్‌ ఖేరాతోపాటు మరో 21 మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఇందులో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డితోపాటు సీనియర్‌ నేత కొప్పుల రాజుకు అవకాశం కల్పించారు. ఆర్థిక వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్‌గా చిదంబరం, కన్వీనర్‌గా గౌరవ్‌ వల్లబ్‌తోపాటు 14 మంది సభ్యులు ఉన్నారు.

ఇందులో సంజీవరెడ్డి, జేడీ శీలంకు అవకాశం ఇచ్చారు. అంతర్జాతీయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్‌గా సల్మాన్‌ ఖుర్షీద్, కన్వీనర్‌గా శశిథరూర్‌తోపాటు 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర మాజీమంత్రి పల్లంరాజుకు ఈ కమిటీలో చోటు కల్పించారు. రైతులు–వ్యవసాయ వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్‌గా భూపేందర్‌ సింగ్‌ హుడా, కన్వీనర్‌గా రఘువీరారెడ్డితోపాటు 14 మంది సభ్యులు ఉన్నారు. సామాజిక న్యాయం సాధికారత వ్యవహారాల ఉపకమిటీకి చైర్మన్‌గా ముకుల్‌ వాస్నిక్, కన్వీనర్‌గా కొప్పుల రాజుతోపాటు 16 మంది సభ్యులు ఉన్నారు.   

మరిన్ని వార్తలు