మాణిక్యమా.. చాణక్యమా? 

13 Sep, 2020 03:21 IST|Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌ను ఏకతాటిపై నడిపించడం సులువేమీ కాదు 

బాధ్యతలు తీసుకున్న వెంటనే ఠాగూర్‌కు ఎన్నికల రూపంలో అగ్నిపరీక్ష 

అన్ని ఎన్నికల్లో ఓటమి పాలైన కుంతియా సారథ్యం.. అందుకే తప్పించారా? 

దుబ్బాక ఉపఎన్నికలు, మండలి, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ‘మంత్ర’ మేంటో? 

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మార్పుతో టీపీసీసీ చీఫ్‌ మార్పుపైనా చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించడానికి మాణిక్యం ఠాగూర్‌ ఏమైనా మ్యాజిక్‌ చేయగలరా.. చాణక్యంతో కాంగ్రెస్‌ పార్టీని ఆధిక్యంలోకి తీసుకురాగలరా? వచ్చీరాగానే వచ్చిపడిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నావను ఏవిధంగా నడిపించగలరు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో సాగుతున్న హాట్‌హాట్‌ చర్చ. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆర్‌.సి.కుంతియా స్థానంలో నియమితులైన ఈ తమిళనాడు లోక్‌సభసభ్యుడు మాణిక్యం ఠాగూర్‌ పని అంత సులవేమీ కాదనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో సాగుతోంది. ఈయన పనితీరు రాష్ట్ర కాంగ్రెస్‌ను గాడిలో పడేస్తుందా? తలపండిన నేతలున్న రాష్ట్రంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి నడపడం సాధ్యమవుతుందా? రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి బాటలోనే టీపీసీసీ అధ్యక్షుడిని కూడా మారుస్తారా? తాజాగా పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.  

‘మూడు’ను బట్టి... 
కుంతియా ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సాధించిన పెద్ద విజయాలేమీ లేవు. ఆయన ఓ మూసలో వెళ్తారనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరిగేది. అందుకే వేటు పడి ఉంటుందేమోననే చర్చ ఉంది. కానీ, మాణిక్యంపై మాత్రం ఇందుకు భిన్నమైన చర్చ జరుగుతోంది. మాణిక్యం విద్యార్థి సంఘం నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, తమిళనాడు లాంటి రాష్ట్రంలో పార్టీ తరఫున రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన టీపీసీసీ విషయాలను సులువుగానే ఒంటబట్టించుకుంటారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు కలిపి... రాష్ట్రంలోని సగానికిపైగా నియోజకవర్గాల్లో మరోసారి ప్రజల తీర్పు రానుంది. ఈ తీర్పు ఆయనతోపాటు తెలంగాణలో కాంగ్రెస్‌ భవిష్యత్తును కూడా నిర్దేశించనుంది.  

జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం ఏది? 
తాజా పునర్వ్యవస్థీకరణలో ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు. ఎప్పటిలాగే ఐఎన్‌టీయూసీ నేత సంజీవరెడ్డిని సీడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా నియమించిన సోనియా ఇతర నాయకులను పరిగణనలోకి తీసుకోలేదు. అటు ఇతర రాష్ట్రాలకు ఇన్‌చార్జీలుగాకానీ, పార్టీ ప్రధాన కార్యదర్శులుగాకానీ, ఇతర కమిటీల్లో కానీ రాష్ట్రానికి చెందిన నేతలనెవరినీ సోనియా నియమించలేదు. పార్లమెంటు సమావేశాల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఏఐసీసీలో చర్చ ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అనుయాయులుగా పేరొందిన ఒకరిద్దరు నేతలు డోలాయమానంలో పడ్డారు. కానీ, వారు కూడా సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా ఉన్నందున ఆజాద్‌ ప్రభావం రాష్ట్రంలో కనిపించే అవకాశమేమీలేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు