తెలంగాణలో ’భారత్‌ జోడోయాత్ర’ రూట్‌ మ్యాప్‌ సిద్ధం.. 15 రోజులపాటు..

7 Sep, 2022 11:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్ర రూట్‌మ్యాప్‌ దాదాపు ఖరారైంది. చివరి నిమిషంలో అనివార్యమైన మార్పులు జరిగితే తప్ప యథాతథంగా కొనసాగే రూట్‌ను మంగళవారం టీపీసీసీ విడుదల చేసింది. ఈ మ్యాప్‌ ప్రకారం అక్టోబర్‌ 24న రాహుల్‌ కర్ణా టకలోని రాయచూర్‌ నియో జకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్‌ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు. మక్తల్‌ నియోజక వర్గంలోని కృష్ణ మండలం గుడ వల్లూరు గ్రామం వద్ద ఆయన రాష్ట్రంలోకి వస్తారు.

అక్కడి నుంచి దేవరక్రద, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి,జోగి పేట, శంకరంపేట, మద్నూరుల మీదుగా మహా రాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తారు. మొత్తం మీద 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర రాహుల్‌ తెలంగాణలో పాదయాత్ర చేస్తారని, రోజూ ఓ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా యాత్రలో పాల్గొంటారని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. 
మునుగోడుకు వస్తారా?

పాదయాత్రలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌ను మునుగోడు నియోజకవర్గానికి తీసుకెళ్లాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయిన సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మధ్య ఈ విషయమై చర్చ జరిగినట్టు సమాచారం. పాదయాత్ర సమయంలోనే ఓ రోజు మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాలని, ఇందుకోసం షెడ్యూల్‌లో మార్పు జరిగేవిధంగా అధిష్టానాన్ని కోరాలని ఇరువురూ నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకు రాహుల్‌ అంగీకరిస్తారని, ఆయన రాష్ట్రానికి వచ్చేలోపు మునుగోడు ఉపఎన్నిక జరగని పక్షంలో కచ్చితంగా మునుగోడులో రాహుల్‌ సభ ఏర్పాటు చేయిస్తామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించడం గమనార్హం.  
చదవండి: అసెంబ్లీ ఆరు నిమిషాలా?.. భట్టి విక్రమార్క ఫైర్‌

మరిన్ని వార్తలు