‘కమిటి’మెంట్‌తో.. కలిసికట్టుగా..

22 Jun, 2022 12:49 IST|Sakshi

శాంతియుత ఆందోళనతో బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల విజయం

అంతా వయసులో చిన్నోళ్లు.. వారు నడిచిన తీరుకు మెచ్చుకోళ్లు

సమస్యలపై విజ్ఞప్తులు.. పరిష్కారం కాకపోవడంతోనే నిరసన బాట

కమిటీలు వేసుకుని.. బాధ్యతలు పంచుకుని ముందుకు..

నిర్మల్‌/బాసర: వారంతా వయసులో చిన్నవాళ్లు.. సాధారణ కుటుంబాల నుంచే వచ్చినవాళ్లు.. చదువుకునేచోట ఇబ్బందులతో ఆవేదన చెందారు.. సమస్యలను పరిష్కరించాలంటూ వరుసపెట్టి విజ్ఞప్తులు చేసుకున్నారు.. ఎక్కడా స్పందన లేకపోవడంతో నిరసన బాట పట్టారు. అడ్డగోలు నినాదాల్లేవు.. ఉద్రేక నిరసన ప్రదర్శనలు లేవు. ఓపికగా, ఓ పద్ధతిగా, వీసమెత్తు హింస లేకుండా ఆందోళన చేశారు. రాత్రీపగలు, ఎండావానను లెక్క చేయకుండా బైఠాయించారు. పక్కా ప్రణాళికతో, అందరి మద్దతు కూడగట్టుకునేలా వ్యవహరించి.. కోరుకున్నది సాధించారు. ఇదీ బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సాధించిన ఘనత. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఆరు నెలల ముందు నుంచే..
ఈ నెల 14న బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌) విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన ప్రారంభించారు. ఎంతకూ వెనక్కి తగ్గకుండా కొనసాగించి విజయం సాధించారు. ఈ పోరాటం వెనుక ఆరు నెలల శ్రమ ఉంది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను ఎలాగైనా పరిష్కరించు కోవాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

ముందే నేరుగా ఉద్యమానికి దిగకుండా.. అందరికీ తమ సమస్యలను చెప్పాలని నిర్ణయించుకున్నారు. క్యాంపస్‌ అధికారులకు వినతిపత్రం ఇవ్వడంతో మొద లుపెట్టి.. జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి వీసీ, ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి, విద్యాశాఖ మంత్రి దాకా విజ్ఞప్తులు చేశారు. ఎలాంటి స్పందన రాకపో వడంతో చివరి అస్త్రంగా ఆందోళన బాట పట్టారు.


ఎలా చేయచ్చో తెలుసుకుని.. 

తమ ఆందోళన ఎలా ఉండాలి? ఎలా ఉద్యమం చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది? నిరసన తెలిపే హక్కు (రైట్‌ టు ప్రొటెస్ట్‌) కింద ఏం చేయొచ్చు, ఏం చేయవద్దన్న అంశాలపై విద్యార్థులు అధ్య యనం చేశారు. ఆర్జీయూకేటీ చట్టం ఏం చెబుతోం దన్నదీ పరిశీలించారు. ఆందోళన సమయంలో సంయమనంతో ఎలా ముందుకు సాగాలనేది కూడా నోట్స్‌గా రాసుకున్నారు.

క్రియాశీలకంగా ఉండేవారితో ‘స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (ఎస్‌జీసీ)’ ఏర్పాటు చేసుకున్నారు. వర్సిటీలోని మొత్తం 7 బ్రాంచ్‌లకుగాను ఒక్కో బ్రాంచ్‌కు ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని చొప్పున 14 మందిని ఎం పిక చేసుకున్నారు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులను, 20 మంది కోర్‌కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కమిటీకి అనుసం ధానంగా క్రియాశీలకంగా వ్యవహరించేందుకు టెక్నికల్‌ సపోర్ట్‌ టీమ్, విద్యార్థులను పోగు చేసే టీమ్, స్పైటీమ్‌.. ఇలా 12 కమిటీలను ఎన్నుకుని, ఎవరేం చేయాలో నిర్ణయించుకున్నారు. వీటిలో జూనియర్‌ విద్యార్థులనూ భాగస్వాములను చేశారు.


ప్రతీది ప్రణాళికతోనే..

సీనియర్, జూనియర్‌ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యమం ఎందుకు చేస్తున్నామనేది వివరించారు. ఆందోళన ఎక్కడ చేయాలి? వరుసలో ఎలా, ఎవరెవరు కూర్చోవాలి? భోజన సమయంలో బ్యాచ్‌ల వారీగా ఎలా వెళ్లిరావాలనేది పక్కాగా ప్లాన్‌ చేసుకున్నారు. దీనితోనే ఎర్రటి ఎండ మండినా, భారీ వర్షం ముంచెత్తినా ఒక్కరూ కదలలేదు. 24 గంటల దీక్షలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మాయిలు కూడా ఆరు బయటే నిద్రించారు. జిల్లా కలెక్టర్‌ వచ్చి నాలుగు గంటల పాటు బతిమాలినా లోపలికి వెళ్లలేదు.

అంతా గమనిస్తూ..
విద్యార్థులు తమ ఆందోళన ఎక్కడా అదుపు తప్పకుండా, ఎవరూ తమను ప్రభావితం చేయకుండా పక్కాగా వ్యవహరించారు. వర్సిటీలో ఎక్కడేం జరుగుతోంది? ఎవరెవరు క్యాంపస్‌లోకి వస్తున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాన్ని 40 మందితో కూడిన స్పైకమిటీ గమనిస్తూ ఉండేది. రేవంత్‌రెడ్డి వర్సిటీ గోడదూకి వస్తున్న విషయం కూడా పోలీసుల కంటే విద్యార్థులకే ముందు తెలుసు. తమ మధ్య ఉంటూ ఆరా తీసేందుకు పోలీసులు ఎలా ప్రవరిస్తున్నారో కూడా గమనించగలిగారు. ఇక తమ పోరాటాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసేలా చేయడానికి పబ్లిసిటీ కమిటీ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అప్‌డేట్‌ చేస్తూ వచ్చింది.

చివరి అస్త్రంగానే ఆందోళన
మాది కొత్తగూడెం. నాన్న చనిపోవడంతో అమ్మ కష్టపడి చదివించింది. నాకు నాన్నే స్ఫూర్తి. ట్రిపుల్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్నా. ఎంతగా విజ్ఞప్తి చేసినా వర్సిటీ సమస్యలు తీరకపోవడంతో చివరి అస్త్రంగానే ఆందోళనకు సిద్ధమయ్యాం. అందరం సమష్టిగా సాధించుకున్నాం.
– మాదేశ్‌ సుంకరి, ఎస్‌జీసీ అధ్యక్షుడు 

సమష్టి విజయం
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వెనకడుగు వేయకుండా విద్యార్థులమంతా సమష్టిగా సాధించిన విజయమిది. హుజూరాబాద్‌ నుంచి వచ్చి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నా. ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులందరి భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆందోళన చేశాం.
– లావణ్య గున్నేటి, ఎస్‌జీసీ ఉపాధ్యక్షురాలు 

శాంతియుతంగా పోరాడి..
మాది వరంగల్‌. సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ట్రిపుల్‌ఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నా. ఎవరికీ ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పోరాడాలనుకున్నాం. అలాగే చేసి సాధించుకున్నాం.
– సాయిచరణ్, ఎస్‌జీసీ ప్రధాన కార్యదర్శి  

మరిన్ని వార్తలు