Jagga Reddy vs Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు!

4 Jul, 2022 02:28 IST|Sakshi

జగ్గారెడ్డితో పాటు వీహెచ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసే యోచనలో హైకమాండ్‌ 

సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. పదేపదే పార్టీ లైన్‌ దాటుతూ వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిపై చర్యలు కఠినంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్‌కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక సూచనలు చేశారు.

పార్టీ లైన్‌ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. అప్పటి నుంచి ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయని జగ్గారెడ్డి శనివారం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తీరు పార్టీ ఇన్‌చార్జిలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి చేసిన ‘గోడకేసి కొడతాం..’ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని చెప్పాల్సింది పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జితో పాటు పొలిటికల్‌ కన్సల్టెంట్‌గా ఉన్న సునీల్‌ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు పార్టీకి సమాచారం లేకుండా యశ్వంత్‌సిన్హాకు బేగంపేట ఎయిర్‌పోర్టులో టీఆర్‌ఎస్‌తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్‌ నోటీసులివ్వాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ‘పార్టీ లైన్‌ దాటి మాట్లాడనని రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాట తప్పినం’దుకు తానే సొంతంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్న జగ్గారెడ్డి.. దీనిపై సోమవారం సంచలన ప్రకటన చేయబోతున్నట్టు చెప్పారు.   

మరిన్ని వార్తలు