నోటిఫికేషన్ల కోసం యువత మరో ఉద్యమం చేపట్టాలి: భట్టి

6 Apr, 2021 19:08 IST|Sakshi

నోటిఫికేషన్ల కోసం యువత మరో ఉద్యమం మొదలు పెట్టాలి..

ముఖ్యమంత్రి ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారు..

ఈ ఎన్నికల్లో విద్యార్థులు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి..

నాగార్జునసాగార్‌: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి మార్గాలు లేక ఆదాయంరాక తీవ్ర నిరుత్సాహంలో ఉందని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదిగా ఉపాధి లేక నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉంటున్న రవి అనే ప్రయివేటు టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవి పార్థివ దేహానికి ఈ సందర్భంగా భట్టి విక్రమార్కమల్లు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మొన్న సునీల్ నాయక్, నిన్న మహేందర్ యాదవ్.. నేడు రవి ఆత్మహత్యలు ముఖ్యమంత్రి పాపమేనని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొలువుల కోసమేనని.. ఆ కొలువులు రావని తెలిసి యువత ఆత్మహత్యకు పాల్పడుతోందని భట్టి ప్రశ్నించారు.  ఆత్మహత్యలు దీనికి సమాధానం కాదని ఆయన యువతను ఉద్దేశించి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు కోసం యువత మరో ఉద్యమం మొదలు పెట్టాలని.. ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రజలను మాటలతో భ్రమలో ఉంచుతూ తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలను నీరు గార్చుతున్నారని భట్టి మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురౌవుతోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

ఈ దోపిడీని ఆపాలంటే యువత రోడ్డుమీదకు వచ్చి.. ఉద్యమానికి నడుం బిగించాలని సిఎల్పీ నేత పిలుపునిచ్చారు. ఎన్నికలను కుటిల ప్రయత్నాలతో గెలుస్తూ.. తాను చేసింది కరెక్ట్ అని ప్రజలు తీర్పు ఇస్తున్నారని చెబుతున్న కేసీఆర్ కు ఎన్నికల్లోనే ప్రజలు బుద్ది చెప్పాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు