కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత

27 Apr, 2021 17:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు ఆయనకు వైద్యం అందించిన వైద్యులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం.​ ఆయన మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్‌లో ఎమ్మెస్సార్‌ మంత్రిగా పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎమ్మెస్సార్.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెస్సార్ విసిరిన సవాల్‌తో 2006లో తొలిసారి తెలంగాణ కోసం కేసిఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎమ్మెస్సార్ సహకరించారు.

ఎమ్మెస్సార్‌ మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిం‍చాలని అధికారులను అదేశించారు. 

ఎమ్మెస్సార్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీఎం జగన్ తెలియజేశారు.


చదవండి: కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..?

మరిన్ని వార్తలు