ఇది ఆత్మహత్యకాదు.. ప్రభుత్వ హత్య!

3 Apr, 2021 04:00 IST|Sakshi

కేసీఆర్‌ మెడలు వంచి ఉద్యోగాలు తెచ్చుకుందాం: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

నాంపల్లిలో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం

హైదరాబాద్‌: ఆత్మహత్యకు పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్‌నాయక్‌ మృతి చెందడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో ఇక ఉద్యోగాలు రావని, పోరాటం చేయాలని, తాను బతికి వస్తే మీతో కలుస్తానని సునీల్‌ నాయక్‌ పిలుపునివ్వడం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, కేసీఆర్‌ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకుందామని ఆ ప్రకటనలో ఉత్తమ్‌ వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, పట్టభద్రుడు సునీల్‌ నాయక్‌ ఆత్మహత్య కేవలం కేసీఆర్‌ సర్కార్‌ చేతగానితనంతోనే జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు కారణమయిన కేసీఆర్‌ అండ్‌ కో,  ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలివ్వకుండా వారి చావులకు కారణమవుతున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు.  

సునీల్‌కు నివాళి... 
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ నేతృత్వంలో పలువురు సునీల్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్దినమని, కలెక్టర్‌ అవుతానన్న గిరిజన బిడ్డ కాటికి పోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌ డౌన్‌డౌన్‌... మా ఉద్యోగాలు–మాక్కావాలి అంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు.    

ఎర్రబెల్లి ఇంటి ముట్టడి
సునీల్‌ మృతి వార్త ఉమ్మడి వరంగల్‌లో దావానలంలా వ్యాపించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సునీల్‌ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది.  హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా యి.

ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉండగా, సునీల్‌ మృతదేహం శుక్రవారం సాయంత్రం తండాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ తదితరులు గ్రామస్తులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్‌ ముందు బైఠాయించారు. సునీల్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం కావాలంటూ డిమాండ్‌ చేశారు.  

 అండగా ఉంటాం: ఎర్రబెల్లి 
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగం రాలేదన్న బాధ, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి సునీల్‌ నాయక్‌ మృతి పట్ల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంతాపం ప్రకటించారు. సునీల్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి సునీల్‌ లేని లోటు తీర్చలేనిదని, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు