ఇది యాత్రల కాలం

9 Feb, 2021 02:27 IST|Sakshi

పోటాపోటీగా టీపీసీసీ నేతల పాదయాత్రలు, భరోసా యాత్రలు 

అచ్చంపేట నుంచి రైతు పాదయాత్ర ప్రారంభించిన రేవంత్‌ 

నేటి నుంచి ఆదిలాబాద్‌ మీదుగా యాత్రకు సిద్ధమైన భట్టి 

రేపటి నుంచి జగ్గారెడ్డి ‘చలో ప్రగతిభవన్‌’ 

రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు సిద్ధమవుతున్న మరికొందరు నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఒక్కొక్కరు యాత్రల బాట పడుతున్నారు. టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక వరకు వాయిదా పడిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. సీఎల్పీ పక్షాన పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో కలసి ఆయన రాష్ట్ర వ్యాప్త యాత్రకు ప్రణాళిక రూపొందించుకున్నారు. 13 రోజుల పాటు ఆయన రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి రైతులతో ముఖాముఖి భేటీ కానున్నారు. ఈయన యాత్ర ప్రారంభించడానికి ముందే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం నుంచే అకస్మాత్తుగా పాదయాత్ర ప్రారంభించారు. చదవండి: (దేశ సరిహద్దుల్లో పనిచేసిన వ్యక్తిని..)

రాజీవ్‌ రైతు దీక్షల పేరుతో అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో చోట దీక్ష చేయాలని నిర్ణయించిన ఆయన ఆదివారం అచ్చంపేట దీక్షకు వెళ్లి అక్కడి నుంచి ఏకంగా పాద యాత్ర నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌ వరకు చేస్తున్న ఆయన పాదయాత్ర అప్పుడే మూడో రోజుకు చేరింది. ఇక, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. బుధవారం సదాశివపేట నుం చి తన యాత్రను ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిభవన్‌ వరకు పాదయాత్రగా వచ్చేందుకు షెడ్యూల్‌ రూపొందించుకుని పోలీసు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.  

మూడూ రైతుల పేరిటే.. 
♦ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ముగ్గురూ తమ యాత్రలను రైతుల పేరిటే నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి తన యాత్రను ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభించి ఈనెల 21న ఖమ్మం జిల్లా వైరాలో ముగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ 13 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. యాత్రలో భాగంగా నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించడం, మార్కెట్‌ యార్డుల్లో పరిస్థితులు తెలుసుకుంటామని, రైతుల పక్షానే యాత్ర చేపడుతున్నామని భట్టి వెల్లడించారు.  
♦ రేవంత్‌ కూడా ఆకస్మికంగా ప్రారంభించిన తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఓవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ రాష్ట్రంలో పర్యటిస్తుండగానే ఆయన అనూహ్యంగా యాత్రకు బయలుదేరడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఆయన తన యాత్రను మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

♦ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎల్పీ నేత భట్టి చేస్తున్న డిమాండ్‌తోనే మరో యాత్ర చేస్తున్నారు. సదాశివపేట మండలం అరూర్‌ గ్రామం నుండి సదాశివపేట, సంగారెడ్డి చౌరస్తా, కంది, రుద్రారం, ఇస్సాపూర్, ముత్తంగి, పఠాన్‌ చెరువు, లింగంపల్లి, శేరిలింగంపల్లి, సెంట్రల్‌ వర్సిటీ, గచ్చిబౌలి, టోలీచౌకి, మెహిదీపట్నం, పంజాగుట్ట చౌరస్తాల మీదుగా ఆయన ప్రగతిభవన్‌ చేరుకోనున్నారు.  
♦ ఈ ముగ్గురికి తోడు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా యాత్రలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు కూడా త్వరలోనే ఓ యాత్ర ప్రారంభిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక, టీపీసీసీ అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఆయన కూడా త్వరలోనే యాత్రకు సిద్ధమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం.  

చదవండి: (సీఎంగా కేసీఆర్‌ను తొలగించాలంటూ గవర్నర్‌ ఫిర్యాదు)

చదవండి: (‘గుర్రంబోడు’ ఘటనలో బండి సంజయ్‌పై కేసు)

మరిన్ని వార్తలు