డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అరెస్ట్

22 Aug, 2020 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు అపాయింట్‌మెంట్‌ లేకుండా డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం  జరిగిన నేపథ్యంలో ఘటనాస్థలానికి వెళ్లిక టీ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ డీజీపీ మహేందర్‌ రెడ్డికి వినతి పత్రం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సంపత్, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు మరి కొంతమంది నేతలు శనివారం నగంరలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే వారికి డీజీపీ అపాయింట్‌మెంట్‌ మంజూరు చేయకపోవడంతో లోపలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బంది వారిని అరెస్ట్‌ చేసి నగరంలోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

కాగా అంతకుముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన శ్రీశైలం పర్యటన ఉద్రిక్తతంగా మారింది.  శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 
 

>
మరిన్ని వార్తలు