పేపర్‌ లీక్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు.. టీఎస్‌పీఎస్సీ రద్దు అధికారం?

22 Mar, 2023 15:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, పేపర్‌ లీక్‌ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం, రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ తమిళిసైని కలిశారు. అనంతరం, రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీక్‌ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. పేపర్‌ లీక్‌ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. మంత్రి కేటీఆర్‌ శాఖ ఉద్యోగులే పేపర్‌ లీక్‌లో కీలక పాత్ర పోషించారు. మంత్రి కేటీఆర్‌ను విచారించాలని గవర్నర్‌ను కోరాం. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిను తీర్పును కోడ్‌ చేస్తూ గవర్నర్‌కు అప్లికేషన్‌ ఇచ్చాం. 

ఇప్పుడున్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను సస్పెండ్‌ చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అందర్నీ సస్పెండ్‌ చేసి పారదర్శక విచారణ చేస్తారని భావించాము. కానీ, ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. విచారణ పూర్తి అయ్యే వరకు టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉంది. పేపర్‌ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. కోట్లాది రూపాయలకు పేపర్‌ అమ్ముకున్నారు’ అని తెలిపారు. 

ఇక, కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు సందర్భంగా వారితో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రతిపక్షాల ఫిర్యాదులపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటానని అన్నారు. పేపర్‌ లీకేజీ వ్యవహారం చాలా బాధాకరం. రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్యను కూడా గవర్నర్‌ ప్రస్తావించారు. 

ఇదిలా ఉండగా.. పేపర్‌ లీక్‌ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుపై ఇప్పటికే సిట్‌ స్పీడ్‌ పెంచింది. నిందితులను విచారిస్తోంది. అలాగే, పేపర్‌ లీక్‌ అంశంలో ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలపై కూడా సిట్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌కు సిట్‌ నోటీసులు పంపింది. వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు ఇవ్వాలని సిట్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్‌ వద్దకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. 
 

మరిన్ని వార్తలు