నర్సింహులు ఆత్మహత్య.. డీజీపీని కలిసిన టీ కాంగ్రెస్‌ నేతలు

31 Jul, 2020 18:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. నిన్న జరిగిన రెండు ఘటనలపై స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతుంది. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. నర్సింహులుకు ఉన్న13 గుంటలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కోవడంతోనే అతడు మరణించాడు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు రియల్‌ ఎస్టేట్ డీలింగ్స్ ఉన్నట్లు అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. రైతు మరణించిన తరువాత ఒక ఎకరా భూమి ఇస్తున్నా అని హరీష్ రావు ప్రకటించడం దురదృష్టకరం’ అన్నారు ఉత్తమ్‌. (శవ రాజకీయాలు చేస్తున్న విపక్షాలు )

‘13శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్ కేబినెట్‌లో స్థానం ఉండదు. ఒకటి, రెండు శాతం జనాభా ఉన్న వారికి 2,3 మంత్రి పదవులు కట్టబెట్టారు. మహబూబ్ నగర్‌లో ఇసుక లారితో తొక్కి చంపించడం కంటే దారుణం ఏదైనా ఉంటుందా? ఇవ్వాళ కేసీఆర్ సీఎం అయ్యారు అంటే దళితులు-గిరిజనుల వల్లే అనేది మర్చిపోవద్దు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు-గిరిజనులపై ప్రతిరోజు హింసాకాండ జరుగుతోంది. తెలంగాణలో పోలీసులు నిజాయితీగా ఉన్నా.. కొంతమంది ఉన్నతాధికారుల వల్ల దళితుల ఘటనల్లో న్యాయం జరగడం లేదు. దళితులపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్‌ని, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలుస్తాం. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కొప్పుల ఈశ్వర్ దళిత నాయకుడిగా ఎన్నోసార్లు ఎన్నికయ్యారు. తప్పుడు ప్రకటనలు చేసి తన స్థాయిని దిగజార్చుకోవద్దు. గజ్వేల్ ఘటనపై టీఆర్‌ఎస్ పార్టీ నేతలు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు