60కి పైగా గెలుస్తాం.. టీపీసీసీ చింతన్‌ శిబిర్‌ సమావేశంలో చర్చ

2 Jun, 2022 03:01 IST|Sakshi

ఇంటెలిజెన్స్‌ సర్వేలు ఇదే చెబుతున్నాయి.. పొత్తుల కోసం వెంపర్లాడొద్దు

టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.. బీజేపీ అంతంతే కీసరలో ప్రారంభమైన మేధోమథనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని, పార్టీ నేతలంతా కలిసి కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామని టీపీసీసీ చింతన్‌ శిబిర్‌ రాజకీయ కమిటీ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం వెంపర్లాడవద్దని, సొంతంగానే అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్లాలని సిఫారసు చేసింది. ఇంటెలిజెన్స్‌ సర్వేలు కూడా 60 స్థానాలకు పైగా గెలుస్తామని చెబుతున్నాయని పేర్కొంది. ‘నవ సంకల్ప్‌ శిబిర్‌’ పేరుతో కీసరలోని బాలవికాస్‌ ప్రాంగ ణంలో టీపీసీసీ రెండు రోజుల మేధోమథనం బుధవారం ప్రారంభమైంది.

తొలిరోజు సమా వేశంలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్థాగత, రాజకీయ, వ్యవసాయ, యువజన, సామాజిక న్యాయ, ఆర్థిక కమిటీలు సమావేశమై కూలం కషంగా చర్చించాయి. ఉదయ్‌పూర్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చింతన్‌ శిబిర్‌ డిక్లరేషన్‌ లోని అన్ని అంశాలకు కమిటీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో పార్టీ అధికారం లోకి వచ్చేందుకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై చర్చించాయి. అందులో భాగంగానే ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాజకీయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ను మరోమారు పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, అదే సమయంలో బీజేపీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని, కాంగ్రెస్సే ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. 

రైతు డిక్లరేషన్‌ తరహాలోనే బీసీ డిక్లరేషన్‌
సామాజిక న్యాయ కమిటీ చర్చలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతపై నాయకులు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంస్థాగత పదవుల్లో 50 శాతం పదవులు ఇవ్వాలన్న ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను అమలు చేయాలని సూచించారు. బీసీ సబ్‌ప్లాన్‌ ప్రకటించాలని, వరంగల్‌లో చేసిన రైతు డిక్లరేషన్‌ తరహాలోనే బీసీ డిక్లరేషన్‌ను బహిరంగసభ ఏర్పాటు చేసి ప్రకటించాలని కోరారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, చాలామంది జిల్లా అధ్యక్షులను పట్టించుకోవడం లేదని కొందరు మాట్లాడినట్టు సమాచారం. క్రమశిక్షణ కమిటీ పనితీరుపై కొంతమంది నేతలు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. కొందరి కనుసన్నల్లోనే ఈ కమిటీ పనిచేస్తోందని, దీన్ని నివారించాలని కోరినట్లు సమాచారం. ఎంఐఎంతో కొట్లాడే విషయంలో పెద్ద నాయకులందరూ ముందుకు రావాలని, ఆ పార్టీపై పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థులకు అన్ని రకాల సాయం చేయాలని ఓ మైనార్టీ నేత సూచించారు. 

అంతర్గతంగానే మాట్లాడుకోవాలి: మాణిక్యం ఠాగూర్‌
నవ సంకల్ప్‌ శిబిర్‌ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ మాట్లాడుతూ.. పార్టీకి మంచి చేసే విషయాలను బహిరంగంగా మాట్లాడాలని, పార్టీ నేతల మధ్య విభేదాలుంటే అంతర్గత సమావేశాల్లో మాత్రమే మాట్లాడుకోవాలని సూచించారు. గతంలో రెబల్‌ నాయకులుగా గుర్తింపు పొందిన వీహెచ్, జగ్గారెడ్డిలు పార్టీ అభివృద్ధి కోసం మంచి లైన్‌ తీసుకుని పనిచేస్తున్నారని అభినందించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌ సిద్ధాంతమని, సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ విధానాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని సూచించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు అన్ని అంశాలపై చర్చించాయని, వీటిపై రేపు పీఏసీలో చర్చించి వాటిని ఆమోదించి ఏఐసీసీకి పంపుతామని మీడియాకు వెల్లడించారు.

బీజేపీని ప్రజలు ఆమోదించరు: ఎంపీ ఉత్తమ్‌
రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆమోదించరని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అభివృద్ధి పనులపై మాట్లాడకుండా గుళ్లు, మసీదుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీజేపీ మతతత్వ ధోరణి ఇక్కడి ప్రజలు నమ్మరని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైనా ఆకాంక్షలు నెరవేరలేదన్న నిస్పృహలో ప్రజానీకం ఉందని, ధనిక రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు.    

మరిన్ని వార్తలు