‘వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు’

25 Nov, 2023 16:27 IST|Sakshi

కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్‌

మధిరలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సభ

హాజరైన ప్రియాంక గాంధీ

మధిర: వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు అని కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల సభలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. ఈ సభకు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు.

పోరాటాల గడ్డ మధిర 
‘మధిర పోరాటాల గడ్డ. కేసీఆర్‌ మొన్న ఇక్కడ సభ పెట్టి ఇక్కడ భట్టి విక్రమార్క గెలవడని చెప్పారు. ఒక్క కేసీఆర్‌ కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు. మధిరలో 50 వేల మెజార్టీతో గెలుస్తా. కేసీఆర్‌, కేటీఆర్‌ ఉడత ఊపులకు మధిర ప్రజలు భయపడరు’ అని దీటుగా బదులిచ్చారు భట్టి విక్రమార్క.

అలాగే ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్‌కే ఓటాయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధికారం వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. 

ఆనందంగా ఉంది: ప్రియాంక
ఇవాళ సంతోషంగా ఉందని, భట్టి నియోజకవర్గానికి వచ్చినందుకు ఆనందంగా ఉందని ప్రియాంక గాంధీ మధిర ప్రచార సభలో పేర్కొన్నారు.  పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కను అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. బీజేపీపైనా విమర్శలు చేశారు.

‘రాత్రి సోనియా గాంధీతో మాట్లాడాను. హైదరాబాద్‌లో ఉన్నాను, భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నానని చెప్పాను. తెలంగాణ వెళ్తున్నావు.. ప్రజలకు ఏం సందేశం ఇస్తావని సోనియా అడిగారు. సత్యమ మాత్రమే చెబుతానన్నాను. మంచి ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు ఆశపడ్డారని, తెలంగాణ కలల సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా చెప్పారు’ అని ప్రియాంక పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు