రూ.3వేల పింఛన్‌.. భార్యాభర్తలిద్దరికీ ఇవ్వండి 

26 Sep, 2022 01:22 IST|Sakshi

ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పండుటాకులు తమ జీవిత చరమాంకంలో ప్రశాంతంగా జీవించేలా మానవతా హృదయంతో ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ను రూ.2,016 నుంచి రూ.3,016కు పెంచాలని, 57 ఏళ్ల వయసున్న వారికి కూడా పెంచిన పింఛన్‌ను అమలు చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్‌ ఇచ్చే విధానం అమల్లో ఉందని, దాన్ని సవరించి అర్హులైన భార్యాభర్తలిద్దరికీ పింఛన్‌ ఇవ్వడం ద్వారా వృద్ధాప్యంలో ఆ దంపతులు మరొకరిపై ఆధారపడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆధార్‌ కార్డులో నమోదైన వయసు కారణంగా చాలా మంది వృద్ధులు పింఛన్‌కు అర్హత పొందలేకపోతున్నారని వెల్లడించారు. అనేక మంది వయసు 60–70 ఏళ్ల వరకు ఉన్నా ఆధార్‌కార్డుల్లో 55 ఏళ్లుగానే నమోదైందని, దీంతో వారు పింఛన్‌ పొందలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపాలిటీల్లో వార్డు సభలు, గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి స్థానికంగా విచారణ చేయడం ద్వారా వారి వయసును ఆధార్‌కార్డుల్లో మార్చి అర్హులైన వారందరికీ పింఛన్‌ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.    

మరిన్ని వార్తలు