పేదల ఇబ్బందులు గుర్తుకు రావా..

19 Dec, 2020 14:15 IST|Sakshi

బండి సంజయ్‌పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పై మాట్లాడకుండా యువతను రెచ్చగొట్టే విధంగా బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఆయనకు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. (చదవండి: రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా..)

‘‘పేదల ఖాతాల్లో వేస్తామన్న 15 లక్షల ఏమయ్యాయి.  కనీసం తెలంగాణలోని పేదలకైనా 15లక్షలు వచ్చాయా.. రాకుంటే ప్రధానితో మాట్లాడి బండి సంజయ్ ఇప్పించగలరా.. దీనిపై బండి సంజయ్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ఆలయాలు, దేవుళ్లు తప్ప.. పేదల ఇబ్బందులు ఆయనకు గుర్తుకురావా. యూపీఏ ప్రభుత్వంలో క్రూడాయిల్, సిలిండర్లపై పది పైసలు పెంచితే బీజేపీ నానాయాగి చేసేది. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది. (చదవండి: పరిహారం అడిగితే.. పోలీసులకు పట్టించిన ఎమ్మెల్యే)

ఇప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  సిలిండర్ రోడ్డు పై పెట్టుకుని నిరసన చేసింది మర్చిపోయారా? యూపీఏ ప్రభుత్వంలో 40 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు డబుల్‌ అయింది. మరి బండి సంజయ్ ప్రధానితో మాట్లాడి ధర తగ్గిస్తారా.. ? యూపీఏ ప్రభుత్వంలో లీటర్ డీజిల్‌ 36 రూపాయలు ఉంటే ఇప్పుడు 78 రూపాయలయ్యింది. ఇది ప్రజలకు ఎంత భారమో బీజేపీ ప్రభుత్వానికి తెలుస్తుందా. కాళీ కామాతా భూముల గొడవ ముఖ్యమా..? క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల ప్రజల ఇబ్బందులు ముఖ్యమా? ’’ అంటూ జగ్గారెడ్డి దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు