వ్యవసాయ చట్టాలపై మోదీ పునరాలోచించాలి..

27 Jan, 2021 17:14 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీకి అంత విశ్వాసం ఉంటే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత రెండు నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళన నిరాశ, నిస్పృహలతో నిండుకుందని, అదే నిన్నటి ఘర్షనలకు దారి తీసిందని పేర్కొన్నారు. 

కేంద్రం ప్రతిపాదించిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతోందని, దీంతో అన్నదాత పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుందని ఆయన వాపోయారు. నిన్నటి పరిణామాలతోనైనా ప్రధాని మోదీ నూతన చట్టాలపై పునరాలోచించాలని  విజ్ఞప్తి చేశారు. నిన్న హస్తినలో చోటు చేసుకున్న ఘటనలపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. నిన్నటి ఘర్షనల్లో ఎర్రకోటపై జెండా ఎగరవేసిన దీప్‌ సిద్దు మోదీ సన్నిహితుడే కావచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే తొలుత వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఆయనే ముందుగా రాష్ర్టంలో చట్టాలను అమలు చేయాలని తహతహలాడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారని.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందం ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే సీజన్‌లో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే, ఢిల్లీ తరహా ఉద్యమం రాష్ర్టంలోనూ పునరావృతం కాక తప్పదని హెచ్చరించారు. మిల్లర్లపై ఉన్న ప్రేమ, రైతులపై ఎందుకు లేదని ఆయన కేసీఆర్‌ను నిలదీశారు.

మరిన్ని వార్తలు