చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ!

30 Sep, 2020 10:31 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మూడు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. అయితే, అధికార పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ప్రత్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు, పోటీలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎన్నికలకు ఇంకా పూర్తిగా సమాయత్తమవలేదు. 

సాక్షి, నిజామాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తుగడలు వేస్తూ ‘కారు’వేగంతో దూసుకెళ్తోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను పార్టీలోకి ఆకర్షిస్తూ ఎన్నికలకు ముందే విపక్షాల్లో గుబులు రేపుతోంది. అయితే, టీఆర్‌ఎస్‌ను నిలువరించాల్సిన కాంగ్రెస్, బీజేపీ చేష్టలూడిగి చూస్తున్నాయి. తమ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గులాబీ శిబిరంలో చేరుతుంటే నిలువరించే ప్రయత్నాలే కరువయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనీస పోటీ అయినా ఇస్తాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. చదవండి: (కవిత పోటీ.. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌)

ఊసే ఎత్తని అధినాయకత్వం.. 
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఊసే ఎత్తడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీగా నియమితులైన మాణిక్యం ఠాకూర్‌ ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. దుబ్బాక ఉప ఎన్నిక, త్వరలో జరగనున్న రంగారెడ్డి, వరంగల్‌ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్యూహాలపైనే చర్చించారే తప్ప ప్రస్తుతం కొనసాగుతున్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కనీసం చర్చ కూడా చేపట్టలేదని సమాచారం.

దీంతో ఇటు జిల్లా నాయకత్వం కూడా ఈ ఎన్నిక విషయంలో డీలా పడిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కనీసం అభ్యర్థినైనా బరిలో ఉంచుతుందా.. లేదా? అనే చర్చ అప్పట్లో జరిగింది. ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ అభ్యర్థి కూడా చివరి నిమిషంలో నామినేషన్‌ ఉపసంహరించుకుంటారనే పార్టీ ప్రాతినిథ్యం కూడా ఉండదనే ముందు జాగ్రత్తగా జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మరో నామినేషన్‌ వేశారు. 

కారెక్కుతున్న కాషాయ కార్పొరేటర్లు 
బీజేపీది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆ పార్టీ అభ్యర్థిగా పోతన్‌కర్‌ ల క్ష్మీనారాయణను బరిలోకి దింపింది. అయితే, ఈ పార్టీ నుంచి రోజుకొక్కరు వలస పోతుంటే నిలువ రించే ప్రయత్నాలేవీ జరిగిన దాఖలాల్లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూకుడుగా వెళ్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ డీలా పడిపోయినట్లు కనిపిస్తున్నాయి.  

మెజారిటీ ఓటర్లు టీఆర్‌ఎస్‌ వారే..
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ తరఫున వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సింహభాగం అధికార పార్టీకి చెందిన వారే. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కలిపి 154 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో ఇప్పటికే సుమారు 50 మంది వరకు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. అటు బీజేపీ నుంచి కూడా గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి పట్టున్న నిజామాబాద్‌ నగరంలో బీజేపీ కార్పొరేటర్లు సైతం కారెక్కుతున్నారు. 570 వరకు ఉన్న టీఆర్‌ఎస్‌ బలం.. వలసలతో 640 వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత సులువుగా గెలిచే అవకాశాలున్నాయి.

ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన మాజీ ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

భారీ మెజారిటే లక్ష్యం 
సాక్షి, నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎంపీలు కేఆర్‌ సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్, ఆకుల లలిత, జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు తదితరులతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్‌ జరిగే అక్టోబర్‌ 9 నాటికి 90 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి టీఆర్‌ఎస్‌కు మద్దతు దక్కేలా టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని అమలు చేస్తోంది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదని, నియోజక వర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పోలింగ్‌ తేదీలోపే ఓటర్లందరికీ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే తీరుపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు