బీఆర్‌ఎస్‌ పొత్తు వ్యవహారం.. కాంగ్రెస్‌ శ్రేణులకు తలనొప్పి!

2 Apr, 2023 02:55 IST|Sakshi

పొత్తు ఉండదని గతంలోనే కుండబద్దలు కొట్టిన రాహుల్‌గాంధీ

ఆ ప్రకటనకే కట్టుబడి ఉంటామన్న రాష్ట్ర ఇన్‌చార్జి ఠాక్రే

అయినా తరచూ తెరపైకి ‘పొత్తు’ ముచ్చట 

తాజాగా జానా వ్యాఖ్యలతో మరోమారు కలకలం

ఈ వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నందునే హుటాహుటిన వివరణ

బీఆర్‌ఎస్‌తో పొత్తుంటే మంచిదేననే భావనలో కాంగ్రెస్‌లోని ఓ వర్గం

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహా­రం రాష్ట్ర కాంగ్రెస్‌లో మరోసారి కలకలం రేపు­తోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండాలా, వద్దా అన్నది ప్రజలు నిర్ణయిస్తారంటూ సీనియర్‌ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీ­యాం­శంగా మారాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు తా­మే ప్రత్యామ్నాయమంటూ ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు జానారెడ్డి, గతంలో పలువురు నేతలు చేసిన పొత్తు వ్యాఖ్యలు కేడర్‌ను అయోమయానికి గురిచే­స్తున్నాయి. మా­రు­తున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మ­రోమారు బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ పొ­త్తు అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది.

కొందరు అలా.. కొందరు ఇలా..
రాష్ట్రస్థాయి కాంగ్రెస్‌ నేతల్లో పొత్తులపై అభిప్రా­యం భిన్నంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు­కు కొందరు నేతలు సుముఖంగా ఉంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో పొత్తు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రా­యా­న్ని కొందరు వ్యక్తం చేస్తుండగా.. బీఆర్‌­ఎస్‌తో పొత్తు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయినట్టేనని, బీజేపీకి అప్పనంగా అవకా­శం ఇచ్చిన వాళ్లమవుతామని మరికొందరు వాది­స్తున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని పార్టీ అధిష్టానం ఇప్పటికే పేర్కొంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా వరంగల్, హైదరా­బాద్‌ సభల్లో దీనిపై స్పష్టతనిచ్చారు. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. అయినా కాంగ్రెస్‌లో పదేపదే బీఆర్‌ఎస్‌తో పొత్తు అంశం తెరపైకి వస్తుండటం గమనార్హం.

అలాగైతే ఉనికి కూడా ఉండదు
బీఆర్‌ఎస్‌తో పొత్తుతో ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి దెబ్బతింటుందనే వాదన కొందరు టీపీసీసీ నేతల్లో వినిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేసి అధికారం కొట్లాడటం ద్వారానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం మిగులుతుందని అంటున్నారు. అధికారం దక్కకపోయినా 40 స్థానాల వరకు గెలుచుకోగలి­గితే అప్పుడు కాంగ్రెస్‌ అవసరం టీఆర్‌ఎస్‌కు వస్తుందని, ఆ సమయంలో కింగ్‌మేకర్‌గా వ్యవ­హ­రించవచ్చని పేర్కొంటున్నారు.

ప్రజలు అవకాశమిస్తే నేరుగా, లేదంటే పరోక్షంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చని స్పష్టం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అనివార్యంగా మూడో స్థానానికి పరిమితం అవుతుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వివరిస్తున్నారు.

అలా కాకుండా ఎన్నికల ముందే పొత్తుకు వెళితే 20–30 మంది పెద్ద నేతలకు లబ్ధి కలుగుతుందే తప్ప మిగతాచోట్ల పార్టీ కేడర్‌ దెబ్బతింటుందని, తద్వారా అధికారానికి శాశ్వతంగా దూరమవుతామని పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ కలిసి ఎన్నికలకు వెళితే ప్రత్యామ్నాయంగా బీజేపీనే ప్రజలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని వాదిస్తున్నారు.

ఎన్నికల్లో కొట్లాడగలమా?
మరికొందరు నేతలు మాత్రం పార్టీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ‘‘గత పదేళ్లుగా అధికారంలో లేం. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెడతాయి. కాంగ్రెస్‌ నేతలకు అలాంటి పరిస్థితి లేదు.

ఈసారి ఎన్నికల్లో ఆ రెండు పార్టీల ధన ప్రవాహాన్ని తట్టుకోవాలంటే పొత్తులు ఉపయోగపడవచ్చు. కనీసం 20–30 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. అధికారంలోనూ పాలుపంచుకోవచ్చు. అప్పుడు మళ్లీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టొచ్చు’’ అని పేర్కొంటున్నారు. అందువల్ల ఎన్నికల కంటే ముందే సర్దుబాటుతో వెళితే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి చర్చతోనూ నష్టమే..
పొత్తులు ఉంటాయో, లేదోగానీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ కాంగ్రెస్‌ కేడర్‌ను అయోమయంలోకి నెట్టేస్తోందని మరికొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది కాడి ఎత్తేసే ధోరణి అని విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్చ కూడా పార్టీకి మంచిది కాదని, దీనికి చెక్‌ పెట్టకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నోరు జారిన కీలక నేత
బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ పొత్తు వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత చరిష్మాకు గండి కొట్టిందని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే ఆ నేత గతంలో ఉన్న ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ వద్ద నోరు జారారని, దీనిపై అధిష్టానాన్ని ఒప్పించాలని కోరారని సమాచారం. ఈ మేరకు ఠాగూర్‌ వెళ్లి అధిష్టానానికి ఈ విషయాన్ని వివరించారని, దీంతో కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌ పక్షం వహిస్తున్నారనే అభిప్రాయం అధిష్టానంలో మొదలైందని తెలిసింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు కీలక నేత.. మళ్లీ తన చరిష్మా కోసం ఇప్పుడు పడరాని పాట్లు పడాల్సి వస్తోందని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి.

అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే: జగ్గారెడ్డి
బీఆర్‌ఎస్‌తో పొత్తు, జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘ఏ పార్టీతోనూ పొత్తుకు పోవద్దు. అప్పుడే పార్టీలో నాయకత్వం నిలబడుతుంది. ప్రజలు అధికారమిస్తారా, ఇవ్వరా అన్నది వారిష్టం. 70సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగాకున్నా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ కీలకం కావాలి. అప్పుడే భవిష్యత్తుపై ఆశలు సజీవంగా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. 

ఏమైనా జరగొచ్చు?
జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేయాల్సిన పనిలేదని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్యారాచూట్లకు (ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి చేరినవారికి) టికెట్లు ఇచ్చేది లేదని 2018 ముందు రాహుల్‌గాంధీనే స్వయంగా చెప్పారని.. కానీ టికెట్ల కేటాయింపులో ప్యారాచూట్లకు కూడా తగిన స్థానం లభించిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌తో పొత్తు విషయంలోనూ ఏదైనా జరగవచ్చని, జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు