Huzurabad: తేలని కాంగ్రెస్‌ అభ్యర్థి.. నేడో, రేపో ప్రకటన

30 Sep, 2021 01:18 IST|Sakshi

హుజూరాబాద్‌ అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్‌ కసరత్తు వేగవంతం 

స్థానిక నేతల్లోనే ఒకరికి అవకాశం ఇచ్చే ఆలోచన 

ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు 

ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పోటీలో లేకుండా పోయిందనే విమర్శలు 

నెలలు గడిచినా ఒక్క సమావేశం కూడా పెట్టని టీపీసీసీ 

తాజాగా సీఎల్పీలో భట్టి, దామోదర, శ్రీధర్‌బాబు, పొన్నం భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: అనుకోకుండా వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌తో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. ఎన్నిక ఇప్పట్లో ఉండదన్న అంచనాతో ఇప్పటివరకు అభ్యర్థిని తేల్చని కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు దూకుడుగా కసరత్తు మొదలుపెట్టారు. ఎవరిని పోటీకి దింపాలి, ఎవరైతే పోటీ ఇవ్వొచ్చన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. మొద ట్లో మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థి అవుతారని భావించినా.. ఇప్పుడు పార్టీ అభిప్రాయంలో మార్పు వచ్చిందని, దళిత అభ్యర్థిని పోటీ చేయించే ఆలోచన ఉందని సమాచారం. కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరును కూడా పరిశీలించినా ఆయన ఆసక్తిగా లేరని తెలిసింది.

ఈ నేపథ్యంలోనే స్థానిక నేతల్లోనే ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై బుధవారం సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, కరీంనగర్‌ జిల్లా నేతలు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ తదితరులు భేటీ అయి చర్చించారు. ఈ సమావేశంలో అభ్యర్థికి సం బంధించి ఎలాంటి స్పష్టతా రాలేదని, గురువారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

పార్టీలోనే అసంతృప్తి.. 
ఈటల రాజేందర్‌ రాజీనామా చేసి నెలలు గడు స్తున్నా.. నియోజకవర్గంలో కనీసం ఒక్కసారైనా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం, అభ్యర్థి ఎంపికలో జాప్యం, ఎలాంటి ప్రచా రం ప్రారంభించకపోవడం పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో కొంత కదలిక వస్తోందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో.. హుజూరాబాద్‌ విషయంగా నిర్లక్ష్యం సరికాదని నేత లు అంటున్నారు. శనివారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి వెళ్లని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరుల వద్ద ఇదే అభిప్రాయం వెలిబుచ్చారని.. పీఏసీ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను ప్రశ్నించారని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా పలు పేర్లతో బహిరంగ సభలు నిర్వహిస్తున్న టీపీసీసీ నేతలు.. ఉప ఎన్నిక ఉన్న హుజూరాబాద్‌లో ఇప్పటివరకు సభ పెట్టకపోవడం, కార్యకర్తల్లో ధైర్యం కలిగించే ప్రయత్నమేదీ చేయకపోవడం ఏమిటని పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్‌ కదనరంగంలోకి దూకకపోతే కష్టమనే అభిప్రాయం వస్తోంది. 

ఇతర పక్షాల మద్దతుతోనా? 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తమతో కలసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళతామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ లెక్కన వామపక్షాలు, టీజేఎస్, ఇంటిపార్టీల మద్దతుతో అక్కడ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ ఈ విషయంలో పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం వస్తుందా, ఆయా పార్టీలు కలసి వస్తాయా అన్నది తేలాల్సి ఉంది.  

ఎందుకీ పరిస్థితి? 
వాస్తవానికి గత ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డి పోటీ చేశారు. ఆయనకు 60వేల ఓట్లు వచ్చాయి. కానీ కౌశిక్‌రెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరకముందు అయినా.. ఆయన వెళ్లిపోయాక అయినా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంగా కాంగ్రెస్‌ చురుగ్గా వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. 1994లో 37 శాతం, 1999లో 33%, 2009లో 28.54%, 2014లో 23.6%, 2018 ముందస్తు ఎన్నికల్లో 35 శాతం వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో గణనీయంగానే ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థికి హుజూరాబాద్‌ పరిధిలో 30శాతం, 2014లో 29.12 శాతం, 2019లో 30 శాతం ఓట్లు వచ్చాయి. ఇలా మంచి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం విషయంలో టీపీసీసీ నాయకత్వం సరిగా వ్యవహరించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు