మునుగోడు బాధ్యత అందరిదీ

22 Aug, 2022 04:22 IST|Sakshi

రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్న కాంగ్రెస్‌ అధిష్టానం 

నేడు ఢిల్లీలో ప్రియాంకతో సమావేశం 

రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ తదితరులకు ఆహ్వానం 

ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తెలంగాణ ముఖ్య నేతలందరి భుజాలపై పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీకి రావాలని, సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని పార్టీ నేతలను హైకమాండ్‌ ఆహ్వానించింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు నల్లగొండ జిల్లా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్‌ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ప్రణాళిక, వ్యూహ కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఈ సమావేశానికి వెళ్తారని తెలుస్తోంది. వీరితో పాటు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావేద్, రోహిత్‌ చౌదరి, పార్టీ తరఫున సర్వేలు నిర్వహిస్తున్న సునీల్‌ కనుగోలు కూడా ప్రియాంకతో జరిగే భేటీలో పాల్గొననున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక అంశమే ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల నివేదికలను పరిశీలిస్తారని, నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న దానిపై కూడా సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

అధిష్టానానికి ఫీడ్‌బ్యాక్‌ 
ఏఐసీసీ పిలుపు అందిన నేపథ్యంలో తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, కాంగ్రెస్‌ పరిస్థితిపై పార్టీ ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించింది. ఇప్పటివరకు పూర్తయిన సర్వే నివేదికల ప్రకారం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి సానుభూతి ఉందనే అంచనాకు ఆ పార్టీ ముఖ్య నేతలు వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం, టీఆర్‌ఎస్‌–బీజేపీలు ఒక్కటై ఈ ఉప ఎన్నికను తెరమీదకు తెచ్చాయన్న వాదనలను నియోజకవర్గ ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారని సర్వేలో తేలినట్టు సమాచారం.

బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఫలితం ఉంటుందని, అదే సమయంలో పాల్వాయి స్రవంతికి కూడా ప్రజల్లోకి వెళ్లగలిగే సామర్థ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా మునుగోడు అభ్యర్థిపై టీపీసీసీ నేతలు కసరత్తు చేశారని, సోమవారం జరిగే భేటీలో తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తారని తెలుస్తోంది.

నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో వారి అభిప్రాయాన్ని కూడా అధిష్టానం అడిగి తెలుసుకోనుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం మునుగోడులో గెలుపు తెలంగాణ నేతల సమిష్టి బాధ్యతని స్పష్టం చేయడంతో పాటు, ఈ మేరకు వెంటనే కార్యరంగంలో దిగాల్సిందిగా దిశానిర్దేశం చేయనుంది.   

>
మరిన్ని వార్తలు