రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుపై ‘పోస్టుకార్డు’ ఉద్యమం

3 Apr, 2023 02:10 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో పొన్నాల, వీహెచ్, మాణిక్‌రావ్, బోసురాజు, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును తప్పుబడుతూ నిర్వహణ 

నేడు గాంధీభవన్‌లో ప్రారంభించనున్న రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఠాక్రే 

8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష 

జై భారత్‌ సత్యాగ్రహ దీక్షలపై సమావేశంలో నిర్ణయాలు.. హాజరైన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్‌ పార్టీ పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించనుంది. సోమవారం గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఈ నెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఏఐసీసీ పిలుపునిచ్చిన జైభారత్‌ సత్యాగ్రహ దీక్షల కార్యాచరణను ఖరారు చేసేందుకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాణిక్‌రావ్‌ ఠాక్రేతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌జావెద్, చిన్నారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు పోదెం వీరయ్య, సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పార్టీ ముఖ్య నేతలు పొన్నం ప్రభాకర్, నాగం జనార్దనరెడ్డి, కొండా సురేఖ, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుంటే చర్యలు: ఠాక్రే 
సమావేశంలో భాగంగా మాణిక్‌రావ్‌ ఠాక్రే మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వహించని నేతలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలను నేతలంతా బాధ్యతాయుతంగా చేపట్టాలని, అందరినీ భాగస్వాములను చేయాలని ఠాక్రే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను పకడ్బందీగా నిర్వహించారని, రేవంత్‌రెడ్డి నిర్వహించిన 30 నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతమైందని అభినందించారు.

రాహుల్‌గాంధీ సందేశాన్ని ఇంటింటికీ అందించారని చెప్పారు. కాగా, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరుకాని నాయకులను పదవుల నుంచి తొలగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటివరకు టీపీసీసీ కార్యవర్గ సమావేశాలు ఐదుసార్లు జరగ్గా ఈ సమావేశాలకు ఒక్కసారి కూడా రాని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను 24 గంటల్లోగా పదవుల నుంచి తొలగించాలని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను రేవంత్‌ ఆదేశించారు.   

మరిన్ని వార్తలు