కారు.. కమలం.. మధ్యలో ’కాంగ్రెస్‌’

5 Sep, 2022 02:39 IST|Sakshi

ఆ రోజున గ్రామగ్రామాన జాతీయజెండాలు, ‘బహుజన తెలంగాణ తల్లి’ లోగో ఆవిష్కరణ

పలుచోట్ల విగ్రహాల ప్రతిష్టాపన కూడా.. ఏడాదిపాటు వజ్రోత్సవాలకు ప్లాన్‌

టీఆర్‌ఎస్, బీజేపీలకు దీటుగా ‘సెప్టెంబర్‌ 17’ నిర్వహణకు హస్తం పార్టీ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ‘సెప్టెంబర్‌ 17’సందర్భంగా జరగబోతున్న పొలిటికల్‌ ధూంధాంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా తన వంతు పాలుపంచుకోబోతోంది. కారు, కమలం పార్టీలకు దీటుగా ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని, ఇందుకోసం ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 17న నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో జాతీయజెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. టీఆర్‌ఎస్, బీజేపీలకు కౌంటర్‌గా సిద్ధం చేసిన యాక్షన్‌ ప్లాన్‌ను కాంగ్రెస్‌పార్టీ ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతోంది. 

బహుజన తెలంగాణ స్లోగన్‌తో ముందుకు..
తెలంగాణ విమోచనం, జాతీయ సమైక్యతాదినోత్సవం పేరుతో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు చేస్తున్న రాజకీయ హడావుడిని అందుకోవడంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఏడాది పొడవునా ఉత్సవాలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. సెప్టెంబర్‌ 17న రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అదేరోజున రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన తెలంగాణ తల్లి’పోస్టర్‌ను కూడా ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను కొనసాగించాలని, విలీన వజ్రోత్సవాలను వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 16 వరకు చేపట్టాలని యోచిస్తోంది. వీలున్నన్ని చోట్ల బహుజన తెలంగాణతల్లి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దీంతోపాటు నిజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడంలో కాంగ్రెస్‌ పార్టీ పోషించిన పాత్ర, దేశ స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనమైన ప్రక్రియ గురించి ప్రజలకు వివరించి, అవగాహన కల్పించేందుకు బహుముఖ కార్యక్రమాలు చేపట్టాలని కూడా భావిస్తోంది. ఇప్పుడు హడావుడి చేస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలు అసలు అప్పటికి పుట్టనే లేదని, కేవలం రాజకీయలబ్ధి కోసమే సెప్టెంబర్‌ 17 సందర్భంగా ఉద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే అంశాన్ని కూడా ప్రజలకు వివరించనుంది. కాగా, టీఆర్‌ఎస్, బీజేపీలు వేసిన ట్రాప్‌లో తాము పడబోమని, నాటి విలీన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న పార్టీగా ప్రజలకు తాము చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, చెప్పుకునే చరిత్ర తమ పార్టీకి మాత్రమే ఉందని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు