ఆడియో.. వీడియో.. షోకాజ్‌..!

24 Oct, 2022 01:41 IST|Sakshi

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం సన్నద్ధం

మొదట ఆడియో రిలీజ్‌.. ఆ తర్వాత వీడియోతో కలకలం

బీజేపీకి ఓటేయాలని చెప్పడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం

పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ వెంకటరెడ్డికి షోకాజ్‌ నోటీస్‌

ఆయనపై చర్యలు చేపట్టాల్సిందేనంటూ టీపీసీసీ నాయకత్వం పట్టు!

రాహుల్‌ గాంధీ పాదయాత్ర సమయంలో కాంగ్రెస్‌లో కలకలం

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుస్తాడంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఉప ఎన్నిక ఓవైపు, రాహుల్‌ గాంధీ పాదయాత్ర మరోవైపు ఉన్న సమయంలో వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి బహిర్గతమైన ఆడియో, వీడియోల ఆధారంగా చర్యలు చేపట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ గడువు ముగిశాక ఆయనను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా చర్యలు ఉండే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రేవంత్‌తో విభేదాలతో..
మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో విభేదాలను బాహాటంగానే వ్యక్తపర్చడం సంచలనంగా మారింది. తన సోదరుడు బీజేపీలో చేరిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ప్రచారానికి తాను వెళ్లలేనంటూ వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియాని కలిసి చెప్పారు కూడా. తనకున్న రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రచారానికి వెళ్లకపోవడాన్ని పార్టీ అర్థం చేసుకుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇటీవల లీకైన ఆడియో, వీడియోలలోని వ్యాఖ్యలతో వెంకటరెడ్డి కాంగ్రెస్‌ వాదిగా ఉండలేకపోతున్నారని స్పష్టమైందని పేర్కొంటున్నాయి.

నిజానికి ఈ నెల 19న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై కుమ్మక్కు ఆరోపణలు చేస్తూ.. కాంగ్రెస్‌లో తనను ఒంటరిని చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, కొందరిని కోవర్టులుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి త్వరలోనే వాస్తవాలు బయటికొస్తాయన్నారు. మరుసటి రోజే జబ్బార్‌ భాయ్‌తో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో లీక్‌ అయింది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలని, ఉప ఎన్నిక తరువాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి.

వెంకటరెడ్డి అదే రోజున కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారితో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో తన తమ్ముడే గెలుస్తాడని, తాను మునుగోడు ప్రచారానికి వెళ్లినా కాంగ్రెస్‌కు వచ్చేవి 10వేల ఓట్లేనని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వీడియో లీకై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయింది. ఆడియో ఫేక్‌ అనుకున్నా తర్వాత వీడియో బయటికి రావడంతో కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది.

10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ..
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం మెంబర్‌ సెక్రెటరీ తారిఖ్‌ అన్వర్‌ ఈ నోటీస్‌ జారీ చేశారు. ‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్‌ నేతతో మాట్లాడినట్టు ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ వైఖరిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో పది రోజుల్లో వివరణ ఇవ్వండి’’అని ఆదేశించారు. వచ్చేనెల 3న మునుగోడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో.. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని టీపీసీసీ నాయకత్వం పట్టుపడుతోందని అంటున్నాయి.  

మరిన్ని వార్తలు