Telangana: హస్తం.. ‘సునీల్‌’ సమస్తం! 

21 Jul, 2022 02:01 IST|Sakshi

ప్రతీ నియోజకవర్గంలో సునీల్‌ కనుగోలు సర్వే 

నేతల కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాల అమలుపై ఫోకస్‌ 

గ్రూపు రాజకీయాలపైనా అధిష్టానానికి నివేదిక 

పార్టీలో చేరే నేతలతో నేరుగా చర్చిస్తున్న సునీల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతలకు వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఫీవర్‌ పట్టుకుంది. గతంలో మాదిరిగా కాకుండా సర్వే ఆధారంగా అసెంబ్లీ టికెట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఆశావహులు అప్రమత్తమయ్యారు. సునీల్‌ బృందాలు ప్రతీ నియోజకవర్గంలో సర్వేతోపాటు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నాయి.

ఆశావహుల బ్యాక్‌గ్రౌండ్, వారికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు, ప్రజల్లో ఉన్న అభిమానం, పార్టీ శ్రేణుల అభిప్రాయం.. ఇలా ఓ పది అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు, ప్రజాపోరాటాలను ఆశావహులు తమ నియోజకవర్గాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారు, వాటి ద్వారా పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందా లేదా అన్న అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని అధిష్టానానికి నివేదిక పంపిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆశావహులు నిత్యం తమ నియోజకవర్గలకే పరిమితమై స్థానం పదిలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.

సునీల్‌ బృందాలు ఇప్పటికే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై మొదటి దఫా సర్వే రిపోర్ట్‌ అందించినట్టు తెలిసింది. వారంక్రితం రెండోదఫా సర్వే కూడా ఈ నియోజకవర్గాల్లో ప్రారంభమైనట్టు తెలిసింది.  

గ్రూపు రాజకీయాలపై నజర్‌ 
పలు నియోజకవర్గాల్లో ఆశావహులు చేస్తున్న గ్రూపు రాజకీయాలపైనా సునీల్‌ బృందం ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసి అధిష్ఠానానికి పంపినట్టు తెలిసింది. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోని గ్రూప్‌ రాజకీయాలు, వాటిని వెనుకుండి నడిపిస్తున్న నేతలపై ప్రత్యేకంగా నివేదిక రూపొందించి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు అందించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నివేదిక ఆధారంగానే గ్రూప్‌ రాజకీయాలకు చెక్‌పెట్టే పనిలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.  

అసంతృప్త నేతలకు బుజ్జగింపులు 
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న కీలకనేతలను బుజ్జగించే అంశంలోనూ సునీల్‌ వ్యూహరచన వర్క్‌అవుట్‌ అయినట్టు తెలిసింది. అందులో భాగంగానే మాణిక్యం ఠాగూర్‌ నేరుగా అసంతృప్త నేతల ఇంటికి వెళ్లి బుజ్జగిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఓ ఎమ్మెల్యేతో సైతం మాణిక్యం చర్చించి అసంతృప్తి సద్దుమణిగేలాగా చేస్తున్నారు. పార్టీలైన్‌ దాటి వ్యవహరిస్తున్న నేతలను గుర్తించి అధిష్టానం దగ్గరకే పిలిచి హెచ్చరిక, బుజ్జగింపులు చేసి పంపడంలోనూ సునీల్‌ పాత్ర కీలకమైందనే చర్చ కూడా నడుస్తోంది.   

చేరికలపై సునీల్‌ స్పెషల్‌ ఫోకస్‌ 
పార్టీలో చేరికల అంశాన్ని అధిష్టానం సునీల్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలు, నియోజకవర్గాల్లో వారికున్న పరిచయాలు, గత ఎన్నికల్లో వారి పరిస్థితి తదితరాలను పరిగణనలోకి తీసుకొని చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల లక్ష్మీ చేరికను సునీల్‌ దగ్గరుండి పర్యవేక్షించారని తెలిసింది.   

మరిన్ని వార్తలు