నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత

20 Jan, 2024 02:19 IST|Sakshi

కృష్ణాబోర్డుకు శ్రీశైలం, సాగర్‌ అప్పగింతపై రెండు రాష్ట్రాల సమ్మతి

వారంలో ఈఎన్‌సీలు, కృష్ణాబోర్డు ఆధ్వర్యంలో విధివిధానాల ఖరారు

సాగర్‌ వద్ద కృష్ణా బోర్డు అనుమతితోనే రెండు రాష్ట్రాల ఇంజనీర్లకు ప్రవేశం

తెలంగాణ, ఏపీతో జలశక్తి శాఖ సమావేశంలో రెండు రాష్ట్రాల అంగీకారం

సమావేశం వివరాలను వెల్లడించిన కేంద్ర జలశక్తి శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్‌ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్‌ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్‌ ఓవర్‌ ప్రొటోకాల్స్‌)కు అంగీకారం తెలిపాయి.

అదేవిధంగా  పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్‌లో ఆ శాఖ పొందుపరిచింది.

తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్‌ శివనందన్‌కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సాగర్‌ వద్ద  నో ఎంట్రీ
నాగార్జునసాగర్‌ డ్యామ్‌ పరిసరాల్లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్‌ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.  నాగార్జునసాగర్‌ డ్యామ్‌ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్‌ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి.  ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. 

తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే..
ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్‌ వద్ద 2023 డిసెంబర్‌ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఈ సమావేశంలో కోరారు.     కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. 

విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్‌ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్‌ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్‌ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు