‘కానిస్టేబుల్‌ పరీక్ష’కు నిమిషం నిబంధన 

27 Aug, 2022 01:33 IST|Sakshi

రేపు ఉదయం 10 గంటలకు పరీక్ష 

మెహందీ, టాటూలు వద్దని సూచించిన అధికారులు 

నగర వ్యాప్తంగా 91 సెంటర్లలో పరీక్ష నిర్వహణ 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన జేసీపీ రమేష్‌  

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ అభ్యర్థుల రాత పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 91 కేంద్రాలు ఏర్పాటు చేసిన సిటీ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6.61 లక్షల మందికి పైగా హాజరవుతుండగా సిటీలోనూ పెద్ద సంఖ్యలోనే రాయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్దా అభ్యర్థులను క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలకు పంపడం, నిర్దేశిత ప్రాంతాల నుంచి పరీక్ష పత్రాలకు పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పూర్తయిన తర్వాత జవాబుపత్రాలను బందోబస్తు మధ్య జేఎన్టీయూలోని స్ట్రాంగ్‌ రూమ్‌ సిబ్బందికి అప్పగించడం... ఇలాంటి ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్త కమిషనర్‌ ఎం.రమేష్‌ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  

పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోని రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై కన్నేసి ఉంచాలని, ప్రతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని స్థానిక పోలీసులకు అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.

సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలకు అనుమతించరు. సెల్‌ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్‌ వాచీలు, క్యాలిక్‌లేటర్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్‌ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహందీ, టాటూలకు దూరంగా ఉండాలి. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, పెన్‌ మాత్రమే తెచ్చుకోవాలి. హాల్‌ టిక్కెట్‌పై బోర్డు సూచించిన విధంగా పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా అతికించుకుని రావాలి.  

మరిన్ని వార్తలు