మహిళ, ఇద్దరు చిన్నారులను కాపాడిన జాలర్లు..

20 Nov, 2021 11:55 IST|Sakshi

సాక్షి, అలంపూర్‌(మహబూబ్‌నగర్‌): కార్తీకపౌర్ణమిని పురస్కరించుకు ని వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణానికి చెందిన ఓ మహిళ, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రానికి శుక్రవారం ఉదయం వచ్చింది. ఈ సందర్భంగా పుష్కరఘాట్‌ వద్ద కృష్ణానదిలో స్నానాలు ఆచరిస్తుండగా ఇద్దరు చిన్నారులు మెట్లపైనున్న పాకర వల్ల జారి నీటిలో పడిపోయారు.

వారిని రక్షించేందుకు తల్లి లోపలికి వెళ్లగా ఈత రాకపోవడంతో ముగ్గురూ మునిగిపోయారు. ఇది గమనించిన భక్తులు కేకలు వేయగా అక్కడే ఉన్న వనపర్తి కానిస్టేబుల్‌ కృష్ణసాగర్‌ వెంటనే స్పందించారు. జాలరుల సాయంతో ముగ్గురినీ ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ కానిస్టేబుల్‌ అయ్యప్పమాలను ధరించి తోటి భక్తులతో కలిసి కార్తీకపౌర్ణమి సందర్భంగా బీచుపల్లిలోని ఆలయాలను దర్శించుకుని పూజలు చేయడం కోసం రాగా ఈ సంఘటన చోటు చేసుకుంది.  

మరిన్ని వార్తలు