రెండే రెండు సంస్థలు..

21 Oct, 2020 03:18 IST|Sakshi

ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ

కొత్త సచివాలయ నిర్మాణానికి ఆసక్తి

టెండర్లు దాఖలు చేసింది ఈ రెండు సంస్థలే

23న తెరుచుకోనున్న ఫైనాన్షియల్‌ బిడ్లు

దసరా దాటిన తర్వాతే పనులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ నిర్మాణానికి రెండు టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. నిర్మాణ రంగంలో ప్రముఖ సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీలు మాత్రమే టెండర్లలో పాల్గొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం తో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలతో గడువు పూర్తయిందని ప్రకటించిన రోడ్లు, భవనాల శాఖ అధికారులు.. 2 టెండర్లు మాత్రమే దాఖలైనట్లు వెల్లడించారు. వాటి సాంకేతిక అర్హతలను పరిశీలించి 23న ఫైనాన్షియల్‌ బిడ్లు తెరవనున్నారు. రెండు సంస్థల్లో సాంకేతిక అర్హతల్లో ఎంపికైన సంస్థ తాలూకు ఫైనాన్షియల్‌ బిడ్‌ను మాత్రమే తెరుస్తారు. రెండూ అర్హత సాధిస్తే తక్కువ కోట్‌ చేసిన సంస్థకు కొత్త సచివాలయ నిర్మాణ బాధ్యత అప్పగిస్తారు.

దసరాకు పని ప్రారంభం కానట్టే..
కొత్త సచివాలయ నిర్మాణ పనులను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంవత్సరం లోపు పనులు పూర్తి చేసి వచ్చే సంవత్సరం దసరా రోజున కొత్త భవనాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ టెండర్లకు సంబంధించిన కసరత్తులో జాప్యం జరగటంతో దసరాకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించట్లేదు. 23న ఫైనాన్షియల్‌ బిడ్లు తెరిచిన తర్వాత ఎంపిక చేసిన సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు గ్యారంటీ సమర్పించాలి. లేబర్‌ క్యాంపు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా దాదాపు 15 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, రెండుసార్లు గడువు పెంచాల్సి వచ్చింది. తొలుత స్థానికంగా రిజిస్టర్‌ అయిన సంస్థలే దాఖలు చేయాలన్న నిబంధనతో టెండర్లు ఆహ్వానించారు. ఆ తర్వాత దాన్ని సడలించారు. ఈ సందర్భంగా> తేదీ మారింది. ఆ తర్వాత మరోసారి గడువు పొడిగించారు. దీంతో జాప్యం తప్పలేదు.

వరణుడూ కారణమే..
పనులపై వర్షాల ప్రభావం కూడా ఉంది. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో ఎక్కడ తవ్వినా పెద్దమొత్తంలో నీరు ఊరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో పనులు ప్రారంభించటం కుదరదని, వానల ఉధృతి తగ్గాకే పనులు ప్రారంభించేందుకు అనువైన వాతావరణం ఉంటుందని పేర్కొంటున్నారు.

తొలుత 5 సంస్థలు హాజరు..
ఇటీవల నిర్వహించిన ప్రీ బిడ్‌ సమావేశానికి 5 బడా సంస్థలు హాజరయ్యాయి. ఇందులో తెలంగాణకు చెందినవి కూడా ఉన్నాయి. కానీ టెండర్‌ దరఖాస్తు దాఖలు చేసేందుకు మాత్రం మిగతా 3 సంస్థలు వెనుకడుగు వేశాయి. ఇందులో ఓ సంస్థకు మాత్రం అర్హత లేదని తెలిసింది. తమకు మొబిలైజేషన్‌ అడ్వాన్సు ఇవ్వాలని, నిర్మాణ గడువును ఏడాదిన్నరకు పెంచాలని.. ఇలా పలు విన్నపాలు చేశారు. వీటిని అధికారులు తోసిపుచ్చారు. టెండర్లు తక్కువ సంఖ్యలో దాఖలు కావటానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు