సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన

14 Apr, 2023 04:22 IST|Sakshi

పురపాలకశాఖకు రాచకొండ పోలీసుల లేఖ

ఈ మేరకు భవన నిబంధనలను సవరించాలని సూచన

ఆ కెమెరాలన్నీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం!

దీనితో నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు సులభమనే అంచనా

మహారాష్ట్ర తరహాలో తెలంగాణలో అమలుకు అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో భవన నిర్మాణ అను­మతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టెలివిజన్‌) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు.

ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పుర­పాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్‌ బంకులు, విద్యా సంస్థలు, ఆస్ప­త్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

భారం తక్కువ.. భద్రత ఎక్కువ..
ఇప్పటివరకు గేటెడ్‌ కమ్యూనిటీలు, భారీ భవ­­నాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నా­యి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్ప­నిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్‌మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

కమాండ్‌ సెంటర్‌తో అనుసంధానంతో..
అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్‌ స్నాచింగ్‌లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీఎస్‌పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు.

తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు.

సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..?
భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్‌మెంట్‌లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేసిన చోట్లను జీపీఎస్‌ లొకేషన్‌తో సహా స్థానిక పోలీసుస్టేషన్‌లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. 

మరిన్ని వార్తలు