నాగ్‌పూర్‌ టూ విజయవాడ: ఎకనమిక్‌ కారిడార్‌కు లైన్‌క్లియర్‌

18 Mar, 2023 01:23 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

నాగ్‌పూర్‌–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ ప్రక్రియ వేగవంతం 

ఇప్పటికే తొలి ఆరు ప్యాకేజీలకు మార్గం సుగమం 

తాజాగా చివరి మూడు ప్యాకేజీలకు ఎస్‌ఎఫ్‌సీ ఓకే.. నిధులు మంజూరు 

మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తిగా కొత్త హైవే 

రెండున్నరేళ్లలో రెడీ అంటున్న ఎన్‌హెచ్‌ఏఐ 

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న తొలి ఎకనమిక్‌ కారిడార్‌కు పూర్తిగా లైన్‌ క్లియర్‌ అయింది. నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు నిర్మించే ఈ కారిడార్‌ తెలంగాణ – ఏపీ మధ్య 306 కి.మీ మేర కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.10 వేల కోట్ల ని«ధులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఆదీనంలోని స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ (ఎస్‌ఎఫ్‌సీ) పచ్చజెండా ఊపింది.

ఈ రోడ్డును తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే తొలి ఆరు ప్యాకేజీలకు మార్గం సుగమం కావటంతో టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తికాగా, చివరి మూడు ప్యాకేజీలకు తాజాగా ఎస్‌ఎఫ్‌సీ ఓకే చెప్పి నిధులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ (మంచిర్యాల) నుంచి విజయవాడకు పూర్తిగా కొత్త (గ్రీన్‌ఫీల్డ్‌) యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండున్నరేళ్లలో ఈ జాతీ య రహదారి రెడీ అవుతుందని జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పేర్కొంటోంది.  

మహారాష్ట్ర–తెలంగాణ–ఆంధ్ర: ఓవైపు పర్యావ రణ అభ్యంతరాలు, మరోవైపు భూసేకరణపై ప్రజల నిరసనలు, అలైన్‌మెంట్‌ మార్చాలంటూ రాజకీయ నేతల ఒత్తిళ్లు.. వెరసి ఈ ఎకనమిక్‌ కారిడార్‌పై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్‌–మంచిర్యాల–వరంగల్‌–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్‌పూర్‌ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్‌ మీదుగా మంచిర్యాల వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు వరసలకు విస్తరిస్తున్నారు. ఇక్కడివరకు పాత రోడ్డు (బ్రౌన్‌ఫీల్డ్‌ హైవే) కొత్తగా మారుతుందన్నమాట. మంచిర్యాల నుంచి కొత్తగా భూసేకరణ జరిపి పూర్తి కొత్త రోడ్డుగా నిర్మిస్తారు.

45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరసలుగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు ఉన్న రోడ్డు పైనే ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఈ రోడ్డు బాగా రద్దీగా మారింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రానున్నందున.. నాగ్‌పూర్‌ నుంచి వచే ట్రాఫిక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వాహనాలు దీని మీదుగానే ముందుకు సాగేందుకు వీలవుతుంది. ఈ కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు.  

ఇదీ ప్యాకేజీల స్వరూపం
ప్యాకేజీ 1,2,3
మంచిర్యాల నుంచి వరంగల్‌ వరకు 108.406 కి. మీ నిడివి. వ్యయం రూ.3,440.94 కోట్లు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు పనులు దక్కాయి. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు.. మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర. 

ప్యాకేజీ 4, 5, 6
వరంగల్‌ నుంచి ఖమ్మం వరకు 108.24 కి.మీ నిడివి. వ్యయం రూ.3,397.01 కోట్లు. ప్రస్తుతం టెక్నికల్‌ బిడ్‌ మదింపు జరుగుతోంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం,  ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం. 

ప్యాకేజీ 7, 8, 9
ఖమ్మం నుంచి విజయవాడ వరకు 89.42 కి.మీ నిడివి. వ్యయం రూ.3,007 కోట్లు. స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ తాజాగా ఈ ప్యాకేజీకే నిధులు మంజూరు చేసింది. ఇక టెండర్లు పిలవాల్సి ఉంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి.

మరిన్ని వార్తలు