మేక అడ్డురావడంతో.. బస్టాండ్‌లోకి దూసుకెళ్లిన కంటైనర్‌

21 Aug, 2021 08:11 IST|Sakshi
బస్టాండ్‌ ఆవరణలో నిలిచిన కంటైనర్‌ 

 ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం

జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఢీకొనబోయి మళ్లించిన వైనం 

సాక్షి, గుడిహత్నూర్‌: మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనబోయిన కంటైనర్‌ బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో బస్టాండ్‌లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్‌ వైపు నుంచి ఆదిలాబాద్‌ వెళ్తున్న బస్సు యూటర్న్‌ తీసుకొని గుడిహత్నూర్‌ బస్టాండ్‌ చేరింది. 

మేక అడ్డురావడంతోనే..
బస్సు బస్టాండ్‌లోకి వస్తుండగా మేక అడ్డు రావడంతో డ్రైవర్‌ కొంచెం ముందుకు తీసుకెళ్లి నిలుపడంతో ప్రయాణికులు దిగుతున్నారు. అంతలోనే వెనుక నుంచి ఒక భారీ కంటైనర్‌ వేగంగా వస్తోంది. వేగం అదుపు కాకపోవడంతో డ్రైవర్‌ దానిని బస్టాండ్‌లోకి తీసుకెళ్లాడు. లేకుంటే వేగం తీవ్రతకు బస్సును ఢీకొనేదే. తేరుకున్న డ్రైవర్‌ కంటైనర్‌ను బస్టాండ్‌ ప్లాట్‌ఫాంపై నిలిపి దాక్కున్నాడు. స్థానికులు ఆర్టీసీ డ్రైవర్‌దే తప్పని ఆయనతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకొని కారకులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.   

తప్పెవరిది? 
డోంగర్‌గావ్‌ యూటర్న్‌ నుంచి బస్సు బస్టాండ్‌ వచ్చే క్రమంలో స్పీడ్‌ లిమిట్‌ 40 కి.మీగా ఉంది. కాని ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఓ భారీ కంటైనర్‌ నేరుగా బస్టాండ్‌లోనికి దూసుకెళ్లడంతో దాని స్పీడ్‌ కనీసం 90 కి.మీ వేగం ఉంటుందని తెలుస్తోంది.  ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
చదవండి: బంజారాల బతుకమ్మ... తీజ్‌ పండుగ

మరిన్ని వార్తలు