అంతా మాఇష్టం: చెరువుల్లో నీళ్లు .. కనిపించని పనుల ఆనవాళ్లు..

29 Jun, 2021 08:17 IST|Sakshi

‘పక్క చిత్రం సిరిసిల్ల పట్టణ శివారులోని చంద్రంపేట ఈదుల చెరువు. మిషన్‌కాకతీయ మొదటి దశలో రూ.40 లక్షలతో చెరువులో పూడికతీసి, కట్టను బలోపేతం చేసి మత్తడి నిర్మించాల్సి ఉంది. చెరువులో మట్టితీసి కొంతమేరకు కట్టపై పోసి, మత్తడి కట్టారు. కట్టపై మొరం పోశారు. ఇది రికార్డుల్లో నమోదైన వివరాలు. కానీ ఇదే చెరువులో ఉపాధిహామీ పథకంలో గత ఏడేళ్లుగా స్థానిక కూలీలు మట్టిని తీశారు. ఉపాధిహామీ పథకంలో కూలీలు తవ్విపోసిన మట్టిగుంతలనూ సైతం మిషన్‌కాకతీయలో రికార్డు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని నొక్కేశారు. ఇప్పుడు వర్షాలు పడడంతో చెరువులో నీరు చేరింది. మిషన్‌ కాకతీయలో చేసిన పనులకు లెక్కలు లేకుండా పోయాయి. రికార్డుల్లో మాత్రం పూడిక మట్టి తీసినట్లుగా నమోదు చేసి బిల్లు చెల్లించారు. ఇప్పుడెవరైనా పనుల లెక్కలు చూద్దామంటే నిండిన చెరువులోనే లెక్కలన్నీ పూడుకుపోయాయి.’

‘ఇది ముస్తాబాద్‌లోని పెద్ద చెరువు. దీని ఆయకట్టు 400 ఎకరాలు. 2016లో మిషన్‌కాకతీయలో భాగంగా చెరువుకు రూ.35 లక్షలతో మరమ్మతులు చేశారు. పనులు చేసిన ఆరు నెలలకే 2016 సెప్టెంబర్‌లో వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. కాంట్రాక్టర్ల నాసిరకం పనులకు ముస్తాబాద్‌ పెద్ద చెరువు ఉదాహరణగా నిలుస్తుందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మళ్లీ ఇదే పెద్ద చెరువును 
రూ.6 కోట్లతో గండిని పూడ్చి మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. ఇప్పుడు నిండిన నీటితో ముస్తాబాద్‌ పెద్ద చెరువు కళకళలాడుతోంది.’

సాక్షి, సిరిసిల్ల: పూడుకుపోయిన చెరువులు, కుంటల్లో మట్టిని తొలగించి, కట్టలను బలోపేతం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌కాకతీయ (మన ఊరు.. మన చెరువు)కు శ్రీకారం చుట్టింది. దశలవారీగా జిల్లాలోని చెరువులను బలోపేతం చేసి ఆయకట్టుకు నీరందించాలని, భూగర్భ జలాల పెంపునకు చెరువులు దోహదపడతాయని ఆశించింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్లుగా మారారు. చెరువుల్లో పూడిక తీ యకుండానే తీసినట్లుగా రికార్డులు చేశారు. కొన్ని పనుల్లో నాణ్యత లోపించింది. మొక్కుబడిగా పనులు చేసి ప్రజాధనాన్ని నొక్కేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఒక్కటై లక్ష్యాన్ని నీరుగారించారు. మిషన్‌కాకతీయ బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారులను ఏకంగా అవినీతి నిరో ధకశాఖకు పట్టించే స్థాయికి చేరింది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్‌ కాకతీయ లక్ష్యాన్ని సాధించలేకపోయింది.

పనుల ఆనవాళ్లు.. నీళ్లపాలు
జిల్లాలో మిషన్‌కాకతీయ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు, చెరువును బాగుచేసే పనిని పొందడం, అధికారులతో ఒప్పందం చేసుకుని పనులు చేయకుండా జాప్యం చేశారు. మరోవైపు గతంలో ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను రికార్డు చేయించుకుని ప్రజాధనాన్ని దండుకున్నారు. కాంట్రాక్టర్లు ఎక్కువ మంది అధికార పార్టీ నేతలే కావడంతో ఇరిగేషన్‌ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ చెరువుల్లో పనులను తనిఖీ చేస్తామన్నా నీటితో నిండడంతో పూడిక తీసిన ఆనవాళ్లు.. నీటి అడుగున కనిపించకుండా పోయాయి. మొక్కుబడి పనులతో ఆయకట్టు రైతులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. మి షన్‌కాకతీయ జిల్లాలో స్లోగా సాగింది. మరోవైపు ఇంకా పనులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.

జిల్లాలో కేటాయింపులు ఇలా..
మొదటి దశ: జిల్లాలోని 104 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.20.13 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19.98 కోట్లు ఖర్చు చేసి 12,982.39 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేసినట్లు రికార్డులు చేశారు.

రెండో దశ: 117 చెరువులను బాగుచేసేందుకు రూ.85.23 కోట్లు కేటాయించారు. ఇందులో 105 చెరువులకు రూ.53.10 కోట్లు ఖర్చు చేశారు. 8,789 ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు రికార్డులు చేశారు.

మూడో దశ: 69 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.24.20 కోట్లు కేటాయించారు. ఇందులో 68 చెరువుల్లో పనులు ప్రారంభించి 57 చోట్ల పూర్తి చేశారు. రూ.11.76 కోట్లు ఖర్చు చేసి 12,791 ఎకరాలకు మేలు జరిగినట్లు స్పష్టం చేశారు.

నాలుగో దశ: జిల్లాలో 46 సాగునీటి వనరులను బాగు చేసేందుకు రూ.7.90 కోట్లు కేటాయించారు. 22 చెరువుల్లో రూ.2.98 కోట్లు ఖర్చు చేశారు. 3,714 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలిగినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. 

సగం పనులు కూడా చేయలేదు
మాది ఇల్లంతకుంట మండలం అనంతారం. మా పెద్ద చెరువులో సగం పనులు కూడా చేయలేదు. పూడిక తీయలేదు. కట్టను బందవత్తు చేయలేదు. తూము, మత్తడి దెబ్బతిన్నాయి. చెరువులోని నీరు లీకేజీ అవుతుంది. పూడిక తీస్తే నీళ్లు బాగా ఉండేవి. మిషన్‌ కాకతీయ పనులు మధ్యలోనే వదిలేసి పోయిండ్రు.

– అక్కెం రామస్వామి, రైతు, అనంతారం

చెరువును లోతు చేయాలి
మాది కోనరావుపేట మండలం వెంకట్రావుపేట. మా కేశవరావు చెరువును లోతు చేయాలే. మిషన్‌ కాకతీయలో పనులు చేసినా.. అవి పూర్తి స్థాయిలో జరగలేదు. మత్తడి అలాగే ఉంది. గుట్టల ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో పూడికి వచ్చి చేరుతుంది. పూడికతీసి లోతు చేస్తే చెరువుతో రైతులకు మేలు జరుగుతుంది.

– బైరగోని సురేశ్‌గౌడ్, వెంకట్రావుపేట

కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చాం

జిల్లాలో పనులు చేయకుండా మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్లకు అనేకసార్లు నోటీసులు జారీ చేశాం. జిల్లాలో ఇంకా 48 చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు జరిగిన మేరకు రికార్డులు అయ్యాయి. కాంట్రాక్టర్లకు పేమెంట్‌ సరిగా రావడం లేదు. తెగిపోయిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేస్తాం.

– అమరేందర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ  

మరిన్ని వార్తలు