Hyderabad: ‘ముంపు’ పేరిట ముంచేస్తూ.. రూ. 37 కోట్ల పనుల్లో అక్రమాలెన్నో  

16 Jan, 2023 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పూడికతీత పనుల నుంచి రోడ్ల పనుల దాకా అన్నింటా కుమ్మక్కవుతున్న జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వానాకాలంలో ముంపుసమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌(ఎంఈటీ)లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. ఒకే రకమైన పనికి ఒక్కోచోట ఒక్కోరేటు ఉండగా, కొన్ని చోట్ల ఒక్క శాతం కంటే తక్కువకే కాంట్రాక్టర్లకు కేటాయించగా, కొన్ని చోట్ల 40 శాతానికి మించి లెస్‌కు పనులప్పగించారు.

గత సంవత్సరం వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా వెంటనే తోడిపోయడానికి 326 టీమ్స్‌ ఏర్పాటు చేశారు. వాటిల్లో 160 స్టాటిక్‌ టీమ్స్‌ కాగా, మిగతావి మొబైల్‌ టీమ్స్‌.  మైబైల్‌ టీమ్స్‌లో డీసీఎం, ట్రాక్టర్, టాటా ఏస్, జీప్‌ వంటి వాహనంతో పాటు నలుగురు కార్మికులుంటారని చెబుతున్నా, చాలా ప్రాంతాల్లో ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులనే పనులకు వినియోగించారు. ఉంచాల్సిన వాహనాల బదులుగా ఆటోలనుసైతం వినియోగించారు.

ఇక కార్మికులకు ఇవ్వాల్సిన రేడియం జాకెట్లు, షూస్, రెయిన్‌కోట్లు, గొడుగులు, టార్చిలు వంటివి మాటలకే పరిమితమయ్యాయి. ఈ టీమ్స్‌ ఏర్పాటు పేరిట రూ. 37.42 కోట్ల పనులు చేశారు. కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువచోట్ల పనులు పొందడం.. వాటిల్లో కొన్ని చోట్ల తక్కువలెస్‌కు టెండర్‌ దక్కించుకోగా, మరికొన్ని చోట్ల చాలా ఎక్కువ లెస్‌కు వేయడం అనుమానాలకు తావిస్తోంది.  

రూ. 14 లక్షల పని రూ.6 లక్షలకే .. 
ఒక కాంట్రాక్టు ఏజెన్సీ ఈ టీమ్స్‌ ఏర్పాటుకు సంబంధించి మలక్‌పేట సర్కిల్‌లో ఒక్కొ క్కటి రూ.14.20  లక్షల విలువైన రెండు పనులను దాదాపు రూ. 6.75 లక్షలకే చేసింది. అంటే ఎంత ఎక్కువ లెస్‌కు పనిచేసిందో అంచనా వేసుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్‌ సర్కిల్‌లో ఒక కాంట్రాక్టర్‌ రూ.17.30 లక్షల విలువైన ఒక పనిని 48.58 శాతం లెస్‌తో, రూ.17.35 లక్షల విలువైన మరో పనిని 48.99 శాతం లెస్‌తో చేసేశారట.  

అలాగే ఫలక్‌నుమా సర్కిల్‌లో రూ.12.80 లక్షల విలువైన పనిని 48.01 శాతం లెస్‌తో, రూ.12.80 లక్షల విలువైన పనిని 47.99 శాతం లెస్‌తో పూర్తిచేశారు. ఇంత ఎక్కువ లెస్‌కు పనులు చేశారంటే, టీమ్‌లు అన్నివేళలా పని చేయకపోవడమైనా ఉండాలి. లేదా ఒకే యూనిట్‌ను(వాహనం,వర్కర్లు ) రెండు చోట్లా చూపి ఉండాలి. లేదా వర్కర్లను తగ్గించి ఉండాలి.  ఈ ఉదాహరణలు కేవలం మచ్చుకు మాత్రమే. ఇలా అత్యధికంగా 40 శాతం, అంత కంటే ఎక్కువ  లెస్‌తో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు.

ఒక్క శాతం లోపునే.. 
ఇక అత్యల్పంగా ఒక్క శాతం కంటే తక్కువ లెస్‌తోనే పనులు చేసిన వారు సైతం ఉన్నారు. హయత్‌నగర్‌ సర్కిల్‌లో రూ.13 లక్షల విలువైన పనిని చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో రూ. 15 లక్షల విలువైన పనిని కేవలం ఒక్కశాతం కంటే తక్కువ లెస్‌కే చేశారు. 

రూ. 10 కోట్ల అవినీతి..? 
వీటిని చూస్తుంటే కొన్ని  సర్కిళ్లలో అధికారులు అంచనా వ్యయం అత్యధికంగా వేసి కాంట్రాక్టర్లతో ఎక్కువ లెస్‌ వేయించారా? లేక పనులు  మేం చూసుకుంటాంలే అని పనులు చేయకున్నా బిల్లులు చెల్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సర్కిళ్లలో అంచనా వ్యయం రూ.20 లక్షలుంటే కొన్ని సర్కిళ్లలో కోటిరూపాయల వరకుంది. వాహనాలు ఎక్కడైనా ఒకటే. సిబ్బంది సంఖ్యలో తేడా ఉంటే అంచనా వ్యయంలో ఆమేరకు  కొంత తేడా ఉండవచ్చుకానీ రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటానికి కారణం సంబంధిత ఇంజినీర్లకే తెలియాలి.

ఇంజినీర్లు, కాంట్రాక్టరు కుమ్మక్కై జీహెచ్‌ఎంసీ ఖజానాకు గండి కొట్టడానికి వారి ఇంజినీరింగ్‌ ప్రతిభాపాటవాలు ప్రదర్శించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  తిలా పాపం తలా పిడికెడులా  కొందరు స్థానిక  కార్పొరేటర్లకు సైతం  వాటాలంది  ఉంటాయని  జీహెచ్‌ఎంసీ వ్యవహారాలు తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ముంపు పరిష్కార పనుల్లో   దాదాపు రూ. 10 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి.  

అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.. 
అవకతవకలపై ఫిర్యాదులున్నాయని,  విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు.

కొందరికే ఎక్కువ పనులు.. 
∙కొందరు  కాంట్రాక్టర్లు  ఎక్కువ  పనులు దక్కించుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. ఎల్‌బీనగర్‌ జోన్‌లోని ఉప్పల్,హయత్‌నగర్‌ రెండు సర్కిళ్ల పనులు చేసిన ఒక కాంట్రాక్టర్‌  ఒక చోట 7.25 శాతం లెస్‌తో చేయగా, మరోచోట 29.09 లెస్‌తో చేశారు. అంటే ఒక చోట తగ్గించింది మరోచోట పూడ్చుకున్నారన్న మాట. ఇదే కాంట్రాక్టర్‌ అల్వాల్, మల్కాజిగిరి సర్కిళ్లలోనూ చేశారు. అక్కడ మాత్రం కేవలం 0.09 శాతం, 0.56 శాతం లెస్‌కు మాత్రమే చేయడం విశేషం.  

►అదే జోన్‌లో ఇద్దరు కాంట్రాక్టర్లు హయత్‌నగర్, ఎల్‌బీనగర్‌ రెండు సర్కిళ్లలోనూ , మరో కాంట్రాక్టర్‌ ఉప్పల్, సరూర్‌నగర్‌ రెండు సర్కిళ్లలో పనులు చేశారు. హయత్‌నగర్, ఎల్‌బీనగర్‌ సర్కిళ్లలో పనులు చేసిన ఒక కాంట్రాక్టరే   కూకట్‌పల్లి, అల్వాల్, రాజేంద్రనగర్,బేగంపేట   సర్కిళ్లలోనూ పనిచేశారు.

 ►చందానగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలోని  ఆరు పనుల్లో నాలుగింటిని ఒక్క కాంట్రాక్టరే చేశారు. మరో కాంట్రాక్టర్‌ జూబ్లీహిల్స్‌తోపాటు కార్వాన్, గోషామహల్‌లోనూ పనులు చేశారు. 

► గోషామహల్‌లోని కాంట్రాక్టర్‌ మూడు పనుల్ని  45 శాతం లెస్‌కు చేశారు.

►రాజేంద్రనగర్‌లోని పనులన్నింటినీ రెండు సంస్థలే దక్కించుకున్నాయి.

►ఇలా చెప్పుకుంటూ పోతే మాన్సూన్‌ ఎమర్జెన్సీటీమ్స్‌ పేరిట జరిగిన మాయాజాలానికి అంతే లేదు.  

మరిన్ని వార్తలు