‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!

26 Jan, 2022 05:10 IST|Sakshi

ఇళ్లు సీజ్‌.. సామగ్రిజప్తు చేస్తున్న వైనం..

పెండింగ్‌లో రూ. 2,558 కోట్ల రుణ బకాయిలు

లక్షన్నర మంది రైతులపై పంజా!

సాక్షి, హైదరాబాద్‌: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది రైతుల పరిస్థితి. ఒకవైపు అకాల వర్షాలతో పంట నష్టపోగా, మరోవైపు యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో అనేకచోట్ల పొలా లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించాలంటూ రైతుల ఇళ్లపై సహకార బ్యాంకులు దాడులు చేస్తున్నాయి. కొద్దిమొత్తంలో అప్పులు తీసుకున్న స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద కుటుంబాలను కూడా వదలడంలేదు. బాధితులను బయటకు పంపి ఇళ్లను సీజ్‌ చేస్తున్న ఘటనలు పలు జిల్లాల్లో చోటుచేసుకుంటున్నాయి.  

సహకార రుణాల్లో 90 శాతం మేర రైతులవే.. 
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 9 డీసీసీబీలున్నాయి. వాటి పరిధిలో 372 బ్రాంచీలున్నాయి. మరో 820 సహకార సంఘాలున్నాయి. ఆయా సహకార బ్యాంకులు దాదాపు 10 లక్షల మంది రైతులకు రుణాలిచ్చాయి. రైతాంగానికి, వివిధ వర్గాల ప్రజలకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలను, పంట రుణాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పథకాల కింద రుణాలను అందిస్తుంటాయి. భూములను, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తులను తనఖా పెట్టుకొని కూడా దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. వివిధ రకాల వ్యాపార రుణాలు మంజూరు చేస్తుంటాయి.

డ్వాక్రా గ్రూపులకు జాయింట్‌ లయబుల్‌ గ్రూపు (జేఎల్‌జీ)లకు కూడా అప్పులు ఇస్తున్నాయి. అయితే మొత్తం సహకార రుణాల్లో 90 శాతం మేర రైతులవే. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌(టెస్కాబ్‌) లెక్కల ప్రకారం.. రైతుల వద్ద మొత్తం రూ.5,310 కోట్ల బకాయిలు పేరుకుపోగా, ఇప్పటివరకు రూ. 2,752 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.2,558 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో దీర్ఘకాలిక రుణాలు రూ.738 కోట్లు, పంటరుణాలు రూ.1,820 కోట్లు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాల వసూళ్లపైనే డీసీసీబీలు దృష్టి సారించాయి.

ఈ రుణాలు తీసుకున్న రైతులే 2 లక్షల మంది ఉంటారు. వీరిలో దాదాపు లక్షన్నర మందికిపైగా బకాయిపడినట్లు సమాచారం. రుణాలు చెల్లించనివారి ఇళ్లలోని వస్తువులు, వంటసామగ్రి, బియ్యం జప్తు చేయటం వంటి చర్యలకు సహకార బ్యాంకు అధికారులు పాల్పడుతున్నారు. ఇళ్లను సీజ్‌ చేస్తుండటంతో పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అయితే రుణమాఫీ పరిధిలోని పంట రుణాల సొమ్మును వసూలు చేయబోమని, అంతకుమించి బకాయి పడితే మాత్రం వదలబోమని అధికారులు అంటున్నారు.  

బకాయిలు పేరుకుపోయినందునే.. 
ఇప్పటికే అనేక సహకార బ్యాంకులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. డీసీసీబీల పరిధిలో పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేయాలని డీసీసీబీలు నిర్ణయించాయి. అయితే రైతుల ఇళ్లకు తాళాలు వేయడం మాత్రం సరికాదని నా ఉద్దేశం.  
– మురళీధర్, ఎండీ, టెస్కాబ్‌

మరిన్ని వార్తలు