Karimnagar: ‘ఖాకీ’ దిద్దిన కాపురం

23 Aug, 2021 07:36 IST|Sakshi

‘కరీంనగర్‌కు చెందిన యువకుడికి పక్కజిల్లాకు చెందిన యువతితో రెండేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో ఒకరిపై ఒకరి ఆధిపత్యం ఎక్కువైంది. చిన్న విషయాలకే పెద్దగొడవలు జరిగాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. అయినా సమస్య సద్దుమణగకపోవడంతో మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు ఆ జంటకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టారు.’

సాక్షి, కరీంనగర్‌: మూడుముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన ఆ జంటలు విడిపోతామంటూ ఠాణామెట్లు ఎక్కుతున్నారు. చిన్నగొడవలకే పంచాయితీల వరకు వెళ్తున్నారు. కలిసి ఉండమంటూ.. పచ్చటికాపురాన్ని కూల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఠాణా మెట్లు ఎక్కుతున్న పలు జంటలకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇద్దరిమధ్య సయోధ్య కుదిరించి కాపురాలను నిలబెడుతున్నారు జిల్లా మహిళా పోలీసుస్టేషన్‌ అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టేషన్‌కు 794 ఫిర్యాదులు రాగా.. 609 పరిష్కరించి వారికి కొత్తజీవితాలను అందించారు.

వేరు కాపురాల్లోనే ఎక్కువ.. 
► ప్రస్తుతం ట్రెండు మారింది. గతంలో పెద్దలతో కలిసి ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న సమస్య వచ్చినా.. ఇంట్లోనే పరిష్కరించేవారు. ఇద్దరికీ సర్దిచెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. పెళ్లయ్యాక చాలామందికి పెద్దలతో కలిసి ఉండడం రుచించడం లేదు. పెళ్లికి ముందే ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుకాపురం పెట్టేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇంటివారికి దూరంగా వెళ్తున్నారు.
 అలా వెళ్లినవారు కొన్నాళ్లపాటు బాగానే ఉంటున్నా.. తరువాత దంపతుల మధ్య ఆధిపత్యం పెరుగుతోంది. అభిప్రాయభేదాలతో చిన్నగొడవలకే  విడాకుల వరకు వెళ్తున్నారు. చాలాకేసుల్లో రెండు, మూడు నెలల్లోనే విడాకుల వరకు రావడం బాధాకరమని, ఇలాంటివి వేరుకాపురంలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

► తల్లిదండ్రులు సైతం పిల్లలకు పెళ్లికి ముందు కొన్ని నైతిక విలువలు నేర్పించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దాంపత్యబంధం గురించి, అత్తవారింట్లో మెదలాల్సిన పద్ధతుల గురించిచెప్పాలని అంటున్నారు. చిన్న సమస్య రాగానే పెద్దలు కూడా ఆలోచన లేకుండా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. ఇద్దరికి ప్రశాంతంగా సర్దిచెప్పాలని చెబుతున్నారు.

► దంపతులు పరస్పరం అర్థం చేసుకోవాల్సింది పోయి, అనుమానం పెంచుకోవడం, పట్టించుకోకపోవడం కాపురాల్లో చిచ్చుపెడుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మద్యానికి బానిసకావడం, వివాహేతర సంబంధాలు సరికాదని అంటున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారే ఉంటున్నారని ఎస్సై సురేందర్‌ తెలిపారు. 

► దంపతులు గొడవలతో కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌కు రాగానే.. వారికి వేర్వేరుగా కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తల బంధం గురించి వివరిస్తుంటారు.స్టేషన్లోని కౌన్సిలింగ్‌ సెంటర్‌ సైకాలజిస్టులు, న్యాయనిపుణులు, పోలీసులు కలిసి వారికి సర్దిచెబుతుంటారు. సమస్యను బట్టి అనుకూలమైన పరిష్కారాన్ని మార్గం చూపుతుంటారు. ఆవేశంగా వచ్చిన దంపతులు ఏకమై వెళ్లడం సంతోషంగా ఉందని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సమస్య చిన్నగా ఉన్నప్పుడే  పరిష్కరించుకోవాలి 
దంపతుల మధ్య ఏర్పడిన సమస్యను చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ప్రతీ విషయంలో గొడవపడడం మానుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పరస్పరం గౌరవం ఇచ్చుకోవడంతో పాటు అత్తింటివారు, పుట్టింటి విలువలకు గౌరవం ఇవ్వాలి.  ఇలా ముందకుసాగితే వివాహబంధం సంతోషంగా ఉంటుంది. గొడవలు పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కేసుల్లో కౌన్సెలింగ్‌ ఇస్తూ.. దంపతులను కలుపుతున్నాం.    

 – శ్రీనివాస్, సీఐ, కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ 

చదవండి: చలానా పెండింగ్‌ ఉంటే బండి సీజ్‌

మరిన్ని వార్తలు