Hyderabad Weather Changes: వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా

7 Jul, 2022 10:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బస్తీకి సుస్తీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్‌ సహా డెంగీ జ్వరాలు మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తూ ప్రజారోగ్యానికి సవాల్‌ విసురుతున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో మంచం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

వాతావరణం చల్లబడటంతో పాటు తరచూ వర్షంలో తడుస్తుండటంతో శ్వాసకోశ సమస్యలు కూడా రెట్టింపయ్యాయి. నీటితో పాటు ఆహారం కూడా కలుషితమై అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, డిఫ్తీరియా (కంఠసర్పి) బారిన పడుతున్నారు. ఫలితంగానల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సహా ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కడుతున్నారు.  

డెంగీ జ్వరాలు డేంజర్‌..  
డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి ఆవరణలోని పూల కుండీలే కాదు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు, ఇంటికి అటు ఇటుగా ఖాళీగా ఉన్న ప్రదేశా ల్లో తాగిపడేసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరడం, రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్‌పల్లి సహా శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన గెజిటెట్‌ కమ్యూనిటీలు, విల్లాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి.

వీటిలో ముఖ్యంగా డెంగీ కారక ఈడిస్‌ ఈజిప్టే దోమలు వృద్ధి చెంది మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 200పైగా డెంగీ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, మేడ్చల్‌ జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అంచనా.    
చదవండి: తస్మాత్ జాగ్రత్త.. కాల్‌ చేసి ]401]తో కలిపి డయల్‌ చేయాలని చెబుతున్నారా..
 
మళ్లీ విజృంభిస్తున్న కరోనా 
కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సగటున 250– 260, రంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60, మేడ్చల్‌ జిల్లాలో30 నుంచి 40 కేసులు నమోదుతున్నాయి. కరోనా వైరస్‌ సోకిన వారిలోనే కాదు సాధారణ జ్వరపీడితుల్లోనూ లక్షణాలు ఒకే విధంగా ఉండటం వైరస్‌ గుర్తింపు, చికిత్స కష్టంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.

వాంతులు.. విరేచనాలు 
నగరానికి కృష్ణా, గోదావరితో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కలషిత నీరు నదుల్లోకి చేరుతుండటం, సరిగా ఫిల్టర్‌ చేయకుండా పంపింగ్‌ చేస్తుండటంతో ఈ నీటిని తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్‌ జ్వరాల బారినపడుతున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల్లో ఎక్కువ శాతం వీరే ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వండిన తాజా ఆహారానికి బదులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కాచి వడపోసిన నీరు తాగడం, అప్పుడే వండిన తాజా ఆహారం తీసుకోవడం, ముక్కుకు మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు