ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కరోనా విధులు

26 Jul, 2021 00:46 IST|Sakshi

థర్డ్‌ వేవ్‌ వస్తే ఫైనలియర్‌ వారి సేవలను ఉపయోగించుకోవాలి 

బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న విద్యార్థులకూ డ్యూటీలు 

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా థర్డ్‌వేవ్‌ ఒకవేళ వస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు కృషిచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మానవ వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని, వైద్య సిబ్బంది సేవలపై దృష్టిసారించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. ‘ఆసుపత్రుల్లో తగినంతమంది ఆరోగ్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలి. మెడికల్‌ పీజీ నీట్‌ పరీక్ష కోసం సిద్ధమవుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థులను కోవిడ్‌ విధుల్లో ఉపయోగించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ రొటేషన్‌లో భాగంగా మెడికల్‌ ఇంటర్న్‌లను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ విధుల్లో నియమించాలి. చివరి సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే పీజీ ఫైనలియర్‌ విద్యార్థుల (బ్రాడ్‌ అండ్‌ సూపర్‌–స్పెషాలిటీల) సేవలను కొనసాగించాలి. బీఎస్‌సీ, జీఎన్‌ఎం అర్హత గల నర్సులను పూర్తి సమయం ఐసీయూ కోవిడ్‌ నర్సింగ్‌ విధుల్లో ఉపయోగించుకోవచ్చు. అలైడ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌ సేవలను వారి శిక్షణ, ధృవీకరణ ఆధారంగా కోవిడ్‌ విధుల్లో ఉపయోగించుకోవాలి’అని సూచించింది.  

ఆక్సిజన్‌ డిజిటల్‌ ట్రాకింగ్‌ సిస్టం అభివృద్ధి... 
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సాయాన్ని అందిస్తుందని పేర్కొంది. తగినన్ని మందులు, మెడికల్‌ ఆక్సిజన్, ఇతర వైద్య వినియోగ వస్తువుల సదుపాయాన్ని నిర్ధారించడానికి ప్రస్తుత ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి సహకారం ఇస్తామని వెల్లడించింది. మూడంచెల కోవిడ్‌ విధానాలను అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ (సీసీసీ), డెడికేటెడ్‌ కోవిడ్‌ హెల్త్‌ సెంటర్‌ (డీసీహెచ్‌సీ), డెడికేటెడ్‌ కోవిడ్‌ హాస్పిటల్‌ (డీసీహెచ్‌) అమలును కొనసాగించాలంది. పారిశ్రామిక ఆక్సిజన్‌ వాడకంపై ఆంక్షలు విధించినందున ఆ మేరకు రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలని కోరింది. వైద్య ఆక్సిజన్‌ డిమాండ్‌ను నిర్ధారించడానికి, వాటి రవాణాను తెలుసుకోవడానికి ఆక్సిజన్‌ డిమాండ్‌ అగ్రిగేషన్‌ సిస్టమ్, ఆక్సిజన్‌ డిజిటల్‌ ట్రాకింగ్‌ సిస్టంను అభివృద్ధి చేయాలని పేర్కొంది. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయడానికి, ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు స్థాపించాలని సూచించింది. 

మరికొన్ని మార్గదర్శకాలు.. 
► కోవిడ్‌ డ్రగ్స్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌ (సీడీఎంఎసీ)ను ఏర్పాటు చేసి మందుల సరఫరా సజావుగా జరిగేలా పర్యవేక్షించాలి. 
► ఇంటర్‌–డిపార్ట్‌మెంటల్‌ కన్సల్టేషన్ల ద్వారా కోవిడ్‌ ఔషధాలకు సంబంధించి అన్ని సమస్యలపై సమర్థవంతంగా నిర్ణయం తీసుకోవటానికి డ్రగ్స్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ(డీసీసీ)ని ఏర్పాటు చేయాలి.  
► రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాలి. కోవిడ్‌ చికిత్సలో అత్యవసర వినియోగం కింద ఎంపిక చేసిన రోగులకు మాత్రమే దీన్ని ఇవ్వాలి.  
► యాంఫోటెరిసిన్‌ బి (లిపోసోమల్‌) లభ్యతను పెంచాలి.
► కోవిడ్‌ ఔషధాలను బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవాలి.  
► అన్ని జిల్లాల్లో టెలీ–కన్సల్టేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేయాలి.  
► కోవిడ్‌ టీకాలను ఎక్కువ మందికి వేసేలా ప్రణాళిక రచించాలి.  

మరిన్ని వార్తలు