​​​​​​​పంథా మారిన భూ విక్రయాలు.. ‘ధరణి’ సమస్యలే కారణం

15 Mar, 2021 18:37 IST|Sakshi
మాసాయిపేట గ్రామ సమీపంలో ఐదు గుంటల్లో ఏర్పాటైన ఫాంహౌస్‌

వెంచర్లు, విల్లాలకు స్వస్తి.. ఫాంహౌస్‌లపైనే దృష్టి

కొనుగోలుదారుల్లో మారిన ఆలోచనా సరళి

కరోనా.. ‘ధరణి’ సమస్యలే కారణం

పట్టణ శివార్లు, పల్లె భూములపైనా ఔత్సాహికుల ఆసక్తి

‘రియల్‌’ వ్యాపారుల్లో ఫుల్‌ జోష్‌ 

సాక్షి, మెదక్‌: గ్రామీణ ప్రాంతాల్లో భూ విక్రయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల కాలంలో పల్లె భూములపై ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో భూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. కరోనా ప్రభావంతో నగరాలు, జిల్లా కేంద్రా ల్లో నివసిస్తున్న మధ్యతరగతి, ఉన్నత వర్గాల జీవన శైలిలో మార్పు తెచ్చింది. స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో వారానికొక్క రోజైనా గడపాలన్న ఆకాంక్షను రెట్టింపు చేసింది. ఫైనాన్స్, ఇతర రంగాల్లో కంటే భూములపైనే పెట్టుబడులు పెట్టేలా ఆలోచనా సరళిని మార్చేసింది. 

‘ధరణి’ సమస్య కూడా తోడు కావడంతో వెంచర్లు, విల్లాల కొనుగోళ్లకు బ్రేక్‌ పడింది. నాలుగైదు గుంటలైనా సరే.. ఫాంల్యాండ్‌పైనే మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ ద్వారా వ్యవసాయ భూములకే రిజిస్ట్రేషన్‌ అవుతోంది. ఈ క్రమంలో గుంటల భూముల లెక్కన అమ్మడం సులభమని రియల్‌ వ్యాపారులు భావిస్తున్నారు. మూడు గుంటల భూమికి తగ్గకుండా 363 గజాల స్థలంగా పరిగణించి మార్కెట్లో ఫాంహౌస్‌ల కోసం విక్రయిస్తున్నారు.  

60 శాతం భూ విక్రయాలు
గతేడాది నవంబర్‌ 3 నుంచి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఇప్పటి వరకు 1,045 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇందులో 3 నుంచి 10 గుంటల వరకు 60 శాతం మేర భూ విక్రయాలు జరిగాయి. మిగతా 40 శాతం భూములను వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఫాంహౌస్‌ల కోసం కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో మధ్య తరగతి వర్గాలు వీటి నిర్మాణాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. 

లే అవుట్ల ఖర్చు భరించలేకనే.. 
వ్యవసాయ భూమిని నివాసయోగ్య స్థలంగా మార్చేందుకు అనేక నిబంధనలు అడ్డొస్తున్నాయి. గతంలో టౌన్‌ప్లానింగ్, గ్రామ పంచాయతీల అనుమతితో ఇష్టానుసారంగా విల్లాలు, లేఅవుట్లు, వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించేవారు. ఇప్పుడు అలా చేయాలంటే రిజిస్ట్రేషన్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. వ్యవసాయ భూమి ని మొదటగా రెసిడెన్షియల్‌ స్థలంగా మార్పు చేయాలి. అప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)కు పన్ను చెల్లించాలి. ఆ తర్వాతనే రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అనుమతి లభిస్తోంది. దీంతో రియల్‌ వ్యాపారులు ప్లాట్లను ఫాంల్యాండ్‌గా మార్చి విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఖర్చు లేకుండానే ఆదాయం వస్తోందని అంటున్నారు.  

పల్లెల్లో సందడి 
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి.. ఇలా అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల కొనుగోళ్లకు పట్నం వాసులు ముందుకొస్తున్నారు. శని, ఆదివారాల్లో పల్లెలు కార్లతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి 200 కిలోమీటర్ల దూరమైనా ఎకరం భూమి ధర రూ.25 లక్షలు, తారు రోడ్డును ఆనుకుని ఉంటే ఎకరం ధర రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలుకుతోంది.  

ఫాంహౌస్‌లపైనే మక్కువ చూపుతున్నారు  
కొత్త వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తలేరు. జోన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడం.. ధరణిలో కమర్షియల్‌ ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. మూడు గుంటల నుంచి ఎకరంలోపు భూములను కొనుగోలు చేసి.. ఫాం ల్యాండ్‌గా అభివృద్ధి చేసి విక్రయిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కువ మంది వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. 
– సంతోష్‌రెడ్డి, తూప్రాన్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి

చదవండి: 

లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్‌ టాప్‌

దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు

మరిన్ని వార్తలు