మేడ్చల్‌లో అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు నమోదు!

18 Jan, 2022 15:59 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలో 5.65 శాతం 

మొత్తం ఏడు జిల్లాల్లో 4 శాతానికి మించి నమోదు

అత్యంత తక్కువగా గద్వాలలో 0.25 శాతం 

1% కంటే తక్కువ ఉంటేనే నియంత్రణలో ఉన్నట్టు 

17 జిల్లాల్లో 1% కంటే తక్కువ పాజిటివిటీ 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. పాజిటివిటీ రేటు ఒక శాతం లోపుంటే కరోనా నియంత్రణలో ఉన్నట్లు లెక్క. కానీ రాష్ట్రంలో గత వారం సరాసరి పాజిటివిటీ రేటు మూడు శాతం నమోదైంది. అయితే ఏడు జిల్లాల్లో మాత్రం ఏకంగా నాలుగు శాతానికి మించడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 6.95 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.

ఆ తర్వాత జీహెచ్‌ఎంసీలో 5.65, రంగారెడ్డి జిల్లాలో 4.92, నిజామాబాద్‌ జిల్లాలో 4.81, కామారెడ్డి జిల్లాలో 4.51, సంగారెడ్డి జిల్లాలో 4.21, మెదక్‌ జిల్లాలో 4.02 శాతం నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 0.25 శాతం, గద్వాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 0.29 శాతం చొప్పున పాజిటివిటీ రేటు నమోదైనట్లు తెలిపింది. 17 జిల్లాల్లో ఒక శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు నమోదైనట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

చదవండి: కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా

3.3 శాతానికి పెరిగిన పడకల ఆక్యుపెన్సీ 
కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్, ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ శాతం కూడా కాస్త పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాంధీ సహా జిల్లా ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఆక్సిజన్, ఐసీయూ పడకలు 2.7 శాతం నిండిపోగా, ఈ నెల 12వ తేదీనాటికి 3.3 శాతానికి పెరిగింది. అయితే చాలావరకు కేసులు పెద్దగా సీరియస్‌ కావడం లేదని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ రోగుల కోసం 56,036 పడకలు కేటాయించారు. ఇందులో 97 శాతం వరకు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. 

పెరిగిన పిల్లల పడకలు 
పద్నాలుగు ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వీల్లేదు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పిల్లల పడకలను పెంచింది. 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలను 6 వేలు చేసింది. అందులో ఆక్సిజన్‌ పడకలు 4,125 ఉండగా, ఐసీయూ పడకలు 1,875 ఉన్నాయి. అలాగే ఆయా ఆసుపత్రుల్లో పిల్లల వైద్యులు 256 మంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది.  

కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే 
రాష్ట్రంలో లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం కోసం ఫీవర్‌ సర్వే జరుగుతోంది. తద్వారా ముందస్తుగా గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, వైద్యం చేయడం వంటివి చేస్తున్నారు. చాలా మందికి తేలికపాటి లక్షణాలే ఉంటాయి. కొందరికి అసలు లక్షణాలే ఉండటం లేదని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 1,231 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షా కేంద్రాలున్నాయి. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 చోట్ల, ప్రైవేట్‌ లేబొరేటరీల్లో 76 చోట్ల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్‌ పరీక్షలు కూడా జరుగుతున్నాయి.   

రోజుకు కనీసం 71,600 టెస్టులు లక్ష్యం 
ప్రతిరోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. కనీసం 71,600 పరీక్షలైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో రోజుకు కనీసం 12,300 పరీక్షలు చేయాలని భావిస్తున్నారు.

అయితే కనీసం కంటే ఎక్కువగానే కొన్నిసార్లు రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటికే రెండుసార్లు కనీస లక్ష్యానికి మించి టెస్టులు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ఏకంగా 90,021 పరీక్షలు చేయగా అంతకుముందు రోజు 83,153 పరీక్షలు చేశారు. మరోవైపు కొందరు సొంతంగా పరీక్షలు చేసుకుంటున్నారు. అవి రోజుకు దాదాపు 10 వేలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు