కోవిడ్‌ టీకాల కోసం పరుగులు.. మీరు క్యూలో ఉన్నారు!

8 Apr, 2021 09:09 IST|Sakshi

సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌

స్లాట్‌ బుక్‌ చేసుకున్నా.. లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా గ్రేటర్‌లో మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒకవైపు పాజిటివ్‌ కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతుండగా...మరో వైపు కోవిడ్‌ మరణాలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 1734 మంది కోవిడ్‌తో చనిపోగా...తాజాగా మరో ఐదుగురు మృతి చెందారు. బుధవారం అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో 393, రంగారెడ్డిలో 169, మేడ్చల్‌లో 205 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక వైరస్‌ బారినుంచి బయటపడాలంటే టీకా ఒక్కటే ప్రత్యామ్నాయమని భావించి, ఆ మేరకు జనం టీకా కేంద్రాల వెంట పరుగులు తీస్తున్నారు. సామర్థ్యానికి మించి లబ్ధిదారులు వస్తుండటంతో ఆయా కేంద్రాలన్నీ రద్దీగా మారుతున్నాయి. మరోవైపు టీకా కేంద్రాల వద్ద తాగేందుకు మంచినీరు, కుర్చీలు, టెంట్లు వంటి సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

స్లాట్‌బుక్‌ చేసుకున్నా..
జనవరి 16న తొలి విడత టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. మొదట్లో హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకాలు వేశారు. ఆ తర్వాత రెండో విడతలో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులకు వేశారు. మూడో విడతలో 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్‌ వేశారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిని ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ టీచింగ్‌ ఆస్పత్రులు సహా పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో టీకాలు వేస్తున్నారు. వీటితో పాటు మరో 195 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ టీకాలు వేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో వంద మంది చొప్పున రోజుకు సగటున 30 వేల మందికి టీకాలు ఇస్తున్నారు.

చదవండి: సెకండ్‌ వేవ్‌: సర్జరీలకు కరోనా బ్రేక్‌!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా వేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.300 ఛార్జీ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ పనితీరుపై ఉన్న అపోహలతో కొంత మంది మొదట్లో టీకాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రాణాలను కాపాడుకునేందుకు టీకాల కోసం పరుగులు తీస్తున్నారు. ఎంపిక చేసిన కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన టీకాల సామర్థ్యం కంటే ఎక్కువగా లబ్ధిదారులు వస్తున్నారు. కోవిన్‌ యాప్‌లో ముందే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు కూడా కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.  

గాంధీలో కరోనా పడకల సంఖ్య పెంపు  
గాంధీఆస్పత్రి: కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం పడకల సంఖ్య పెంచినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 182 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. బాధితుల కోసం 300 కరోనా ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా, మరో 200 ఆక్సిజన్‌ బెడ్లు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. గాంధీలో కోవిడ్, నాన్‌కోవిడ్‌ రెండు రకాల వైద్యసేవలు అందు బాటులో ఉన్నాయని, బుధవారం 1501 మంది ఓపీ రోగులకు వైద్యం అందించామన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లతోపాటు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.   

చదవండి: బేగంబజార్‌కు కరోనా ఎఫెక్ట్.. టైమింగ్స్ చేంజ్!‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు