Covid Third Wave: ‘ఫిబ్రవరి వద్దు.. డిసెంబర్‌లోనే కానివ్వండి పంతులు గారూ’

12 Dec, 2021 18:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్‌): కరోనా విజృంభనతో గత ఏడాది వివాహాల కళ తప్పింది. నిబంధనల మధ్య కొద్ది మందితో, నిరాడంబరంగా పెళ్లిల్లు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే వివాహాలకు కళ వచ్చింది. పెళ్లిళ్ల సందర్భంగా ఫంక్షన్‌హాల్స్‌ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా వివాహాల హడావుడే కనబడుతోంది. కానీ మళ్లీ ఇప్పుడు కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందనే ప్రచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గత రెండేళ్లలో జరిగిన కరోనా పెళ్లిళ్లను గుర్తు చేసుకుంటూ ముందస్తుగా డిసెంబర్‌లోనే పెళ్లిళ్లను జరిపిస్తున్నారు. 

ఎప్పుడు, ఏమవుతుందోనని.. 
ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించకముందే ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిపించాలనుకుంటున్నారు. ఈక్రమంలో డిసెంబర్‌లో 12,14,16,19,21, 22,24,26 27,28, 29రోజులలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ముందుముందు పరిస్థితులు ఎలా ఉంటాయని భయపడుతూ.. ముందస్తుగా డిసెంబర్‌లోనే పెళ్లి తంతు ముగించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోను ముహుర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నా ముందుగానే పెళ్లికి ముహుర్తాన్ని ఖరారు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 22వరకు ముహుర్తాలు ఉన్నాయంటు పలువురు పండితులు తేదీలను నిర్ణయించినా కూడా ఆ సమయానికి ఒప్పుకోవడం లేదు.  
చదవండి: అడగండి అది మన హక్కు..పెట్రోల్‌ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం

థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదం.. 
ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి, జనం గుంపులుగా తిరగడం చేస్తుండటం వల్ల థర్డ్‌ వేవ్‌  వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటినుంచే జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని పలువురు పేర్కొంటున్నారు. 
చదవండి: వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్‌ శిలాజాలు

డిసెంబర్‌లో జోరుగా పెళ్లిళ్లు 
జనాలు థర్డ్‌వేవ్‌ వస్తుందన్న భయంతోనే డిసెంబర్‌లోనే పెళ్లి చేయాలని అంటున్నారు. దీంతో పురోహితులు ముహూర్తం ఉన్న రోజు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఫిబ్రవరిలో సైతం ముహుర్తాలు ఉన్నాయి. 
–వెంకటేష్‌పంతులు, దుర్కి

మూణ్నాలుగు పెళ్లిళ్లకు వెళ్తున్నా.. 
డిసెంబర్‌ నెలలో ముహుర్తాలు చాలా ఉండటంతో రోజు మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లకు హాజరవ్వాల్సి వస్తుంది. కొన్ని పెళ్లిళకు ప్రయాణం దూరం కావడంతో కొన్ని పెళ్లిళ్లకే హాజరవుతున్నాను. కొన్ని పెళ్లిళ్లకు వెళ్లడానికి సమయం సైతం సరిపోతలేదు.  
–పెర్క రాజు, మైలారం     

మరిన్ని వార్తలు