Telangana: కష్టకాలంలోనూ పన్ను కట్టారు 

31 May, 2021 04:17 IST|Sakshi

కరోనా ప్రభావం నుంచి కోలుకున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

 మూడో నెలలోనే మెరుగుపడ్డ పన్ను ఆదాయం

ఏప్రిల్, మే నెలల్లోనే తక్కువ రాబడి..

జూన్‌ నుంచి ఫిబ్రవరి వరకు స్థిరంగా ఆదాయం

మార్చిలో ఏకంగా రూ.11 వేల కోట్లకు పైగా పన్నుల వసూళ్లు

 2019–20తో పోలిస్తే పన్ను ఆదాయం తగ్గింది రూ. 4,500 కోట్లే

సాక్షి, హైదరాబాద్‌: కష్టాలు వచ్చినా కోలుకునే శక్తి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉందని గత ఆర్థిక సంవత్సరపు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను రాబడులు మందగించినా మూడో నెలలోనే పుంజుకుని అంతకు ముందు ఏడాదితో పోటీ పడేలా ఆదాయం వచ్చిందని లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2020 ఏప్రిల్, మే నెలల్లో లాక్‌ డౌన్‌ కారణంగా తగ్గిన పన్నుల ఆదాయం జూన్‌ నుంచే ఊపందుకుని మార్చి నాటికి ఏకంగా రూ.11 వేల కోట్లకు చేరడం రాష్ట్ర సొంత ఆదాయ పరపతికి నిదర్శనమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా లాక్‌ డౌన్‌ కొనసాగినంత కాలమే పన్ను రాబడులు కొంత తగ్గుతాయని, అంటే 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మాత్రమే ఇబ్బంది ఉంటుందని, ఆ తర్వాత పన్ను ఆదాయానికి ఢోకా ఉండదని ఆ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అంత ఆందోళన అక్కర్లేదు..
వాస్తవానికి కరోనా దెబ్బకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే రూ.40 వేల కోట్లకు పైగా నిధులు తగ్గాయి. అప్పులు పెరిగాయి. దీంతో నిధుల సర్దుబాటు కూడా ఆర్థిక శాఖకు సవాల్‌ గా మారింది. కానీ పన్ను ఆదాయంలో మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని రాబడి లెక్కలు చెబుతున్నాయి. మొత్తం రూ.1.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. అందులో 78 శాతం అంటే రూ.79 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో జీఎస్టీ, అమ్మకపు పన్ను 80 శాతం వరకు రాగా, ఎక్సైజ్‌ రాబడులు 90 శాతం వరకు వచ్చాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం మాత్రమే 52 శాతం వచ్చింది.

అయితే స్టాంపు డ్యూటీ పెంపు ద్వారా రూ.10 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించినా సాధ్యపడకపోవడం, లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు 2 నెలల పాటు నిలిచిపోవడంతో అనుకున్న ఆదాయం రాలేదు. కానీ నెలకు రూ.500 కోట్ల చొప్పున రూ.6 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇక, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.90 వేల కోట్ల పన్ను రాబడులు వస్తాయని అంచనా వేయగా, అందులో 93 శాతానికి పైగా సమకూరింది. కానీ 2020–21లో అదే పన్ను ఆదాయం రూ.12 వేల కోట్లు ఎక్కువగా అంచనా వేయడం, మొదట్లో కరోనా దెబ్బ తగలడంతో ఆదాయం 78 శాతానికే పరిమితమైంది. ఇంత జరిగినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది పన్ను ఆదాయం తగ్గింది మాత్రం రూ.నాలుగున్నర వేల కోట్లు మాత్రమే. 

మరిన్ని వార్తలు