కరోనా: 3 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి.. అనాథగా చిన్నారి

15 May, 2021 08:03 IST|Sakshi
ఉపాధ్యాయ దంపతుల ఫ్యామిలీ(ఫైల్‌) 

విషాదం నింపిన కరోనా

కోవిడ్‌తో ఉపాధ్యాయ దంపతుల మృతి

మూడు నెలల క్రితం అనారోగ్యంతో కూతురు

అనాథగా మిగిలిన చిన్న కుమార్తె

సాక్షి, ఆదిలాబాద్‌: మాయదారి కరోనా ఉపాధ్యాయ దంపతులను బలితీసుకుంది. మూడు రోజుల వ్యవధిలో తల్లి, తండ్రి చనిపోవడంతో ఆ చిన్నారి అనాథగా మారింది. మూడు నెలల క్రితం తోబుట్టువు కూడా అనారోగ్యంతో మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడిలో జరిగింది. గ్రామానికి చెందిన పీత సీతారామరాజు(45), అతని భార్య శైలజ(43) ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సీతారామరాజు వేమనపల్లి మండలం కేతనపల్లిలో, శైలజ కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో పనిచేస్తున్నారు. 15 రోజుల క్రితం సీతారామరాజుకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్సపొందుతూ వచ్చాడు.  శైలజకు కూడా స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే ఉండి మందులు వాడుతూ వచ్చింది.

శ్వాససంబంధిత ఇబ్బందులు తీవ్రమవ్వడంతో బెల్లంపల్లి కోవిడ్‌సెంటర్‌లో ఈ నెల 6న చేరారు. అక్కడ రెండు రోజులు చికిత్స పొంది కరీంనగర్లో అడ్మిట్‌ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం శైలజ మృతిచెందగా, సీతారామరాజు గురువారం మృతిచెందాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు యశస్విని, చిన్న కూతురు తేజస్విని. ఇంటర్‌ చదువుతున్న యశస్విని(17) ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మృతిచెందింది. అటు తల్లితండ్రితోపాటు తోడబుట్టిన అక్క కూడా మృతిచెందటంతో తేజస్విని అనాథగా మిగిలింది. శుక్రవారం తేజస్విని పుట్టినరోజు. బర్త్‌డేను అమ్మనాన్నలతో ఆనందంగా జరుపుకోవాల్సి ఉండగా.. అయిన వారందరినీ కోల్పోయి ఒంటరిగా మిగలటం అందరినీ కంట తడిపెట్టించింది.

మరిన్ని వార్తలు