పర్యాటక ప్రాంతాల్లో  కరోనా నియమాలు పాటించాల్సిందే.. 

13 Jul, 2021 04:36 IST|Sakshi
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సత్కరిస్తున్న స్వాత్మానందేంద్ర సరస్వతి 

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి

మంత్రిని కలిసిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి

సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులు కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర పర్యాటక, సాం స్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను జయించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని జాతీయ పురావస్తు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం కిషన్‌రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్ర అంతా పురావస్తు శాఖ కేంద్రంలో రికార్డు అయిందని, స్వాతంత్య్ర పోరాటఘట్టాలు, రాజ్యాంగానికి సంబంధించిన సంతకాల ప్రతులు ఇక్కడే ఉన్నాయని చెప్పారు. నేషనల్‌ ఆరై్కవ్స్‌ ఆఫ్‌ ఇండియాలో 18 కోట్ల పేజీలు, 57 లక్షల ఫైళ్లు, 64 వేల అధ్యయనాలు, లక్షా ఇరవై వేల మ్యాపులు ఉన్నాయని తెలిపారు. మనదేశం స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశచరిత్రను డిజిటలైజ్‌ చేస్తున్నామని వివరించారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త నిర్మాణాలు వచి్చనప్పటికీ, చారిత్రక సంపదను కాపాడుకొనేందుకు కృషి చేస్తామన్నారు.

పురావస్తు శాఖ అడ్డంకులు తొలగించాలి: శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి 
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సోమవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఢిల్లీలో కలిశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తు శాఖ నిబంధనలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి దంపతులకు శాలువా కప్పి సత్కరించారు.

మరిన్ని వార్తలు