Corona Virus: ఇటు ఈవెంట్లు.. అటు వేరియంట్లు.. హైదరాబాద్‌లో డేంజర్‌ సిగ్నల్స్

22 Dec, 2022 08:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైనాలో మళ్లీ కోవిడ్‌ విజృంభించిందని, ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడిపోతున్నాయని తెలియడంతో నగరంలో అలజడి మొదలైంది. ప్రస్తుత కేంద్రం హెచ్చరికలు, గతానుభవాల నేపథ్యంలో నగరవాసులు దీని గురించి చర్చించడం కనిపించింది. మరికొందరు ముందు జాగ్రత్తగా మాస్కులను ధరించడం కూడా మొదలుపెట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల క్రితం వరకూ కేవలం 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, నగరంలో వాటి సంఖ్య మూడుకు పరిమితమైంది. అలాగే ప్రస్తుతం కోవిడ్‌కు చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 34 మాత్రమే..  

వేడుకలు, ప్రదర్శనల హోరు... 
గత కొన్ని నెలలుగా అన్ని రంగాలూ దాదాపుగా కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకోవడంతో పారీ్టలు, ఈ వేడుకల ఈవెంట్ల సీజన్‌ను ఉత్సాహంగా జరుపుకోవడానికి నగరవాసులు  సిద్ధమయ్యారు. సిటీలో క్రిస్మస్‌ సందర్భంగా పారీ్టలు వేడుకలు, సన్‌బర్న్‌ వంటి బిగ్‌ ఈవెంట్స్‌ జరుగనున్నాయి. మరోవైపు న్యూ ఇయర్‌ వేడుకల కోసం అంతర్జాతీయ స్థాయి సంగీత నృత్య కళాకారులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ ఈవెంట్లకు నగరం, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో సందర్శకులు హాజరయే అవకాశం ఉంది. అదే విధంగా జనవరి ప్రారంభంలోనే నుమాయిష్‌, ఆ తర్వాత మళ్లీ పండుగలు... ఇలా ఎటు చూసినా సందడి వాతావరణం, సమూహాల కోలాహలం కనపడనుంది. వీటిన్నంటి దృష్ట్యా కోవిడ్‌ భయాల నేపథ్యంలో అధికార యంత్రాంగంలోనూ అలజడి మొదలైంది.  

అప్రమత్తమైన అధికార యంత్రాంగం... 
కోవిడ్‌ కేసులు క్షీణించడం, నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన నేపధ్యంలో నగరం నుంచి విదేశాలకు రాకపోకలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈవెంట్స్‌ హోరు... ఈ పరిస్థితుల్లో మరోసారి కోవిడ్‌ కోరలు చాస్తుందేమోనని అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. చైనాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బిఎఫ్‌7 వల్లే దారుణమైన పరిస్థితి ఏర్పడగా, ఈ వేరియంట్‌ను ఇప్పటికే మన దేశంలో గుజరాత్‌లో 2, ఒడిశాలో 1 కేసును గుర్తించినట్టు వెల్లడైంది. దీంతో సిటీ ఎయిర్‌పోర్ట్‌లో సైతం అత్యవసర చర్యలు చేపట్టనున్నారు.  

నత్తనడకన వ్యాక్సినేషన్‌... 
నగరంలో ఇటీవల నత్తనడకన కూడా నడవని∙వ్యాక్సినేషన్‌పై మళ్లీ దృష్టి పెట్టనుంది. నగరంలో రెండో డోస్‌ వ్యాక్సిన్‌ ఇంకా లక్ష్యానికి చాలా  దూరంగానే ఉంది. దీనితో పాటు బూస్టర్‌ డోస్‌ విషయంలో కూడా నగరం ఇంకా లక్ష్యానికి చేరుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో నిరీ్ణత వ్యవధుల వారీగా నగర వాసులకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్‌తో పాటు  కోవిడ్‌ గురించి తీసుకోవాల్సిన ఇతర ముందస్తు జాగ్రత్తలపై కూడా  వైద్యాధికారులు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.  

ఆందోళన వద్దు...అప్రమత్తత మరవద్దు... 
చైనాలో మరోసారి మొదలైన కోవిడ్‌ విజృంభణ అక్కడే ఆగిపోతుందని అననుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదని నగరానికి చెందిన అపోలో ఆసుపత్రి జాయింట్‌ ఎండి సంగీతారెడ్డి హెచ్చరించారు. మూడేళ్ల క్రితం వ్యూహాన్‌లో ఊపిరిపోసుకున్న ఉత్పాతాన్ని ఒక పాఠంగా తీసుకోవాలన్నారు. అయితే   చైనాలో పరిస్థితులపై ఇప్పటికిప్పుడు తీవ్రమైన ఆందోళన అవసరం లేదని, అంతమాత్రాన స్థబ్ధతకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. చైనా నుంచి జరిగే రాకపోకలపై  తగిన విధంగా దృష్టి పెట్టాలన్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు