రాష్ట్రంలో 20 శాతం మందికి పరీక్షలు

18 Jan, 2021 05:52 IST|Sakshi

ప్రతి 10 లక్షల్లో 2 లక్షల మందికి టెస్టులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో ఏకంగా 20 శాతానికి పైగా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం తన నివేదికలో వెల్లడించింది. శనివారం కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు వేసే నాటికి ప్రతీ 10 లక్షల జనాభాలో 2,00,475 మందికి నిర్ధారణ పరీక్షలు చేయడం గమనార్హం. అంటే జనాభాలో 20.04 శాతం మందికి పరీక్షలు చేశారు. శనివారం ఒకరోజు 33,298 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 299 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,666కి చేరిందన్నారు. ఒకరోజులో 379 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,85,898 మంది కోలుకున్నట్లు తెలిపారు. శనివారం కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు 1,577 మంది మరణించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.02 శాతం ఉండగా, కరోనా మరణాల రేటు 0.54 శాతంగా ఉందన్నారు. యాక్టివ్‌ కేసులు 4,191 ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 2,395 మంది ఉన్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు