5 లక్షలు దాటిన కరోనా టెస్టులు

5 Aug, 2020 05:14 IST|Sakshi

70 వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

తాజాగా 1,286 మందికి సోకిన వైరస్‌

12 మంది మృతి.. 563కి చేరిన మరణాలు

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,708

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 5 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 5,01,025 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కేసుల సంఖ్య 70 వేలకు చేరువలో (68,946) ఉన్నాయి. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు మంగళవారం ఉదయం బులెటిన్‌లో స్పష్టం చేశారు. ఇక సోమవారం 13,787 టెస్టులు చేయగా, 1,286 మందికి కరోనా సోకింది. ఈ ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య ఇప్పటివరకు 563కి చేరింది. కరోనా నుంచి కోలుకుని సోమవారం 1,066 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 49,675కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,708గా ఉందని అధికారులు వెల్లడించారు.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డి జిల్లాలో 121, కరీంనగర్‌లో 101, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 72, వరంగల్‌ అర్బన్‌లో 63, నిజామాబాద్‌లో 59, జోగులాంబ గద్వాలలో 55, ఖమ్మంలో 41, మహబూబ్‌నగర్‌లో 39, భద్రాద్రి కొత్తగూడెంలో 38, నల్లగొండలో 29, నాగర్‌ కర్నూలు, పెద్దపల్లి జిల్లాల్లో 29 కేసుల చొప్పున నమోదయ్యాయని శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో 72 శాతం రికవరీ రేటు ఉందని ఆయన తెలిపారు. అదే దేశంలో సరాసరి 65.77 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య 5,907 ఖాళీగా ఉండగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 2,509 పడకలు ఖాళీగా ఉన్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు