90% యాంటిజెన్‌ పరీక్షలే...

28 Jun, 2021 08:27 IST|Sakshi

10 శాతమే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు..  

నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 99.45 శాతం యాంటిజెన్‌ టెస్టులు 

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు లేక లెక్కల్లోకి రాని పలు పాజిటివ్‌ కేసులు  

లక్షణాలున్నా నెగెటివ్‌ రావడంతో జనంలో తిరిగేస్తున్న అలాంటి వ్యక్తులు  

కొత్తగా వచ్చే 14 లేబొరేటరీలతో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెరిగే అవకాశం 

కరోనా పరీక్షలపై వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో 90 శాతంపైగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలపై వైద్య శాఖ ఒక నివేదిక తయారు చేసింది. ఈ సమయంలో మొత్తం 24,69,017 టెస్టులు చేయగా, అందులో 22,45,418 టెస్టులు (90.94%) యాంటిజెన్‌ పద్ధతిలో నిర్వహించినవేనని, కేవలం 9.06 శాతం మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలో చేశామని ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 99.45 శాతం యాంటిజెన్‌ పరీక్షలే నిర్వహించారు. ఇక్కడ కేవలం 0.55 శాతమే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు.

దీనివల్ల చాలావరకు.. కరోనా లక్షణాలుండి యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినవారిలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయకపోవడం వల్ల పాజిటివ్‌ కేసులు మిస్‌ అవుతున్నట్లు అంచనా వేశారు. వాస్తవంగా యాంటిజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చి లక్షణాలుంటే, వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాలన్నది నిబంధన. కానీ చాలామంది నెగెటివ్‌ రిపోర్ట్‌ రాగానే తమకు కరోనా లేదని సాధారణంగా తిరుగుతున్నారు. అటువంటి వారిలో కొందరికి సీరియస్‌ అవుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

కొన్నిచోట్ల ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష అందుబాటులో లేకపోవడం, మరికొన్నిచోట్ల దాని ఫలితం ఆలస్యం కారణంగా అనేకమంది ఈ పరీక్షలను చేయించుకోవడంలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా త్వరలో కొత్తగా మరో 14 ఆర్‌టీపీసీఆర్‌ లేబొరేటరీలు అందుబాటులోకి రానుండటంతో ఈ పరీక్షల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. కాగా, తమిళనాడు రాష్ట్రంలో నూరు శాతం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలే చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది.  

ఆదిలాబాద్‌ జిల్లాలో తక్కువ పాజిటివిటీ
ఈ నెల ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.46 శాతంగా నమోదైందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అందులో అత్యంత తక్కువగా 0.36 శాతం పాజిటివిటీ రేటు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదైంది. ఆ తర్వాత నిర్మల్‌ జిల్లాలో 0.40 శాతం, నాగర్‌కర్నూలు జిల్లాలో 0.66 శాతం, నిజామాబాద్‌ జిల్లాలో 0.69 శాతం పాజిటివిటీ నమోదైంది. కాగా, అత్యధికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2.38 శాతం, ఖమ్మం జిల్లాలో 2.07 శాతం, రంగారెడ్డి జిల్లాలో రెండు శాతం పాజిటివిటీ నమోదైంది.

మరిన్ని వార్తలు