తెలంగాణలో జోరుగా కరోనా టీకా

20 Jan, 2021 09:07 IST|Sakshi

ఒక్కరోజే 51,997 మందికి..

నేడు టీకా కార్యక్రమానికి సెలవు.. మళ్లీ 21న

రాష్ట్రానికి మరో 3.48 లక్షల కోవిషీల్డ్‌ టీకాల రాక

మార్చి నుంచి 50 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ఊపందుకుంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 51,997 మందికి టీకాలు వేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ బులెటిన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండోరోజు 18వ తేదీన 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా 51 మందికి రియాక్షన్లు వచ్చాయని, అందులో ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. బుధవారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సెలవని, తిరిగి ఈ నెల 21వ తేదీన వ్యాక్సినేషన్‌ జరుగుతుందని తెలిపారు. టీకా కార్యక్రమం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. బుధ, శని, ఆదివారాలు, ఇతరత్ర సెలవు దినాల్లో టీకా వేయడం లేదు. బుధ, శనివారాల్లో చిన్న పిల్లలు, గర్భిణులకు రెగ్యులర్‌ సార్వత్రిక టీకాలు వేస్తారు.
జిల్లాలకు కోవిషీల్డ్‌ ..
మంగళవారం ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన మరో 3,48,500 కోవిషీల్డ్‌ టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పుణే నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన టీకాలను కోఠిలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌కు తరలించారు. రెండో దశ పంపిణీ కోసం వాటిని జిల్లాలకు పంపించనున్నారు.

మొదటి విడతలో 80 లక్షల మందికి ఉచితం
మొదటి విడతలో రాష్ట్రంలోని 80 లక్షల మందికి ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి విడత లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారు, 18–50 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముగిసిన తర్వాత మిగతా రెండు కేటగిరీలకు టీకాలు ఇస్తారు. మార్చి నుంచి 50 ఏళ్లు దాటిన వారికి, 18–50 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకాలు వేస్తామని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు